కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనమయిన ఆయన కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలది ఆత్మహత్యేనని ఆ కేసు దర్యాప్తు చేస్తున్న వరంగల్ పోలీసులు ప్రాధమికంగా దృవీకరించారు. వారు తమ రిమాండ్ రిపోర్టును శనివారం కోర్టుకి సమర్పించారు. దానిలో సారిక భర్త అనిల్-ఎ1 ముద్దాయిగా, రాజయ్య-ఎ2, అతని భార్య మాధవీలత-ఎ3, పోలీసుల నుండి తప్పించుకొని తిరుగుతున్న అనిల్ రెండవ భార్య సనను ఎ4 ముద్దాయిగా పేర్కొన్నారు. రాజయ్య ఇంట్లో పనిచేసేవారిని, డ్రైవర్లను, ఇరుగు పొరుగు వారిని మొత్తం 24మందిని ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. వారు
కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న వివరాలు:
సారిక భర్త అనిల్ రెండవ పెళ్లి చేసుకొన్న తరువాత నుండే సారికపై వేధింపులు మొదలయ్యాయి. అతనికి తల్లితండ్రుల పూర్తి మద్దతు ఉంది. ఆమె వారి ముగ్గురి వేధింపులు భరించలేక అనేకసార్లు పోలీసులను ఆశ్రయించింది. ఆమె పోలీసులకు పిర్యాదు చేసిన ప్రతీసారి ఆమెకు రాజయ్య కుటుంబ సభ్యుల నుండి వేదింపులు ఇంకా ఎక్కువయ్యేవి. వారు ముగ్గురూ ఆమెను ఆత్మహత్య చేసుకోమని తరచూ ఒత్తిడి చేసేవారు. అందుకు ఇంట్లో పనివాళ్ళు, డ్రైవర్లు ప్రత్యక్ష సాక్షులు.
ఒకవేళ రాజయ్య వరంగల్ ఉప ఎన్నికలలో గెలిచి ఎంపీ అయినట్లయితే తనపై, తన పిల్లలపై వేదింపులు ఇంకా పెరిగిపోతాయనే భయంతో సారిక ఆత్మహత్య చేసుకొంది. ఆమె, పిల్లలు ముగ్గురూ మంటలు, పొగ కారణంగానే చనిపోయారు. ఆమె పడక గదిలో ఒక ఖాళీ గ్యాస్ సిలిండర్ మరొకటి నిండు సిలిండర్ ఉన్నాయి. ఆమె తెల్లవారు జామున సుమారు 4-4.30 గంటల మధ్య ఆత్మహత్య చేసుకొంది. ఆమె పడక గదిలో నుంచి పొగలు రావడం చూసిన ఇరుగు పొరుగువారు అగ్నిమాపక సిబ్బందికి, 108 అంబులెన్స్ సర్వీస్ కి ఫోన్లు చేసి రప్పించారు.
మేము నిర్దోషులము: రాజయ్య
పోలీసులు తమ ప్రాధమిక విచారణ ముగించి కోర్టుకి రిమాండ్ రిపోర్ట్ సమర్పించగానే రాజయ్య అతని భార్య మాధవిలత ఇద్దరు కోర్టులో బెయిల్ పిటిషను దాఖలు చేసుకొన్నారు. తామిద్దరం నిర్దోషులమని, తమ కోడలు, మనుమల మరణాలతో తమకు ఎటువంటి సంబంధము లేదని వారు తమ పిటిషనులో పేర్కొన్నారు. అసలు తామిద్దరం సారిక ఉంటున్న ఇంట్లో ఉండట్లేదని, వరంగల్ ఉప ఎన్నికలు ఉన్నందున ఆ సంఘటన జరిగిన ముందురోజే ఆ ఇంటికి వచ్చేమని తమ బెయిల్ పిటిషనులో పేర్కొన్నారు. కనుక తమ ఇద్దరికీ బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టుని అభ్యర్ధించారు. వారి బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు దానిని ఈనెల 12కి వాయిదా వేసింది.