హైదరాబాద్: మొత్తం మీద బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎక్కువగా ఆనందించేది సోనియాగాంధి అని చెప్పుకోవాలి. తన కొడుకును ‘రాగా’ ఐరన్ లెగ్ అని, ఎన్నికలు జరిగే ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ కాంగ్రెస్ పరాజయం అని అందరూ జోక్‌లు వేసుకుంటున్న ప్రస్తుత సమయంలో మొదటిసారి రాహుల్ పర్యటించిన చోట కాంగ్రెస్ కూడా విజయం సాధించటం సోనియాకు ఆనందకరమైన విషయమేగా! సొంతంగా కాకపోయినా, మోడికి చావుదెబ్బ తగిలింది కాబట్టి కాంగ్రెస్‌కు విజయమే. బీహార్‌లో పోటీచేసిన 41 స్థానాలలో దాదాపు 25 స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. 2005 తర్వాత బీహార్‌లో కాంగ్రెస్ రెండంకెల స్థానాలు దక్కించుకోవటం ఇదే. అందుకే కాంగ్రెస్ నేతలు ఇవాళ రెచ్చిపోతున్నారు. బీహార్‌లో విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. నితీష్నూ, లాలూను ఒక్కచోటకు చేర్చి మహాకూటమి ఏర్పాటు చేయటం రాహుల్ వల్లే జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీహార్ విజయం కొత్త ఉత్సాహాన్నిస్తుందని చెప్పొచ్చు. ఇది ఎంతోకాలం తర్వాత లభించిన విజయం. 2013లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ విజయం సాధించటం ఇదే! 2014 పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పేలమైన ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే.
బీహార్ విజయంలో రాహుల్ ముఖం ఇవాళ వెలిగిపోయింది. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోడికి చురకలు అంటించారు. మోడి తన దురహంకారం ఇకనైనా తగ్గించుకోవాలని అన్నారు. అది ఆయన పదవికిగానీ, దేశానికిగానీ శోభనివ్వదని వ్యాఖ్యానించారు. ఇక విదేశీ యాత్రలు కట్టిపెట్టి, దేశంలోని రైతులను పట్టించుకోవాలని, నిరుద్యోగులను కలుసుకోవాలని, వారిని దగ్గరకు తీసుకని మాట్లాడాలని అన్నారు. మాటలు కట్టిపెట్టి పని ప్రారంభించాలని సూచించారు. ఈ విజయం ఎన్డీఏపైన కాదని, బీజేపీ, ఆరెస్సెస్, మోడి సిద్ధాంతాలపైన విజయమని అన్నారు. హిందువులు, ముస్లిమ్‌లకు మధ్య గొడవపెట్టి ఎన్నిలలో గెలవాలనుకోవాటం సాగదని ఇచ్చిన సందేశమని చెప్పారు. మోడి తన పద్ధతి మార్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌కు ఈ విజయంద్వారా గౌరవం పెరగనుంది. పార్టీ అధ్యక్షుడిగా చేసినా ఆశ్చర్యపోనవసరంలేదు.