ఇది అదుపు తప్పుతున్న బిజెపి వేగానికి ఒక స్పీడ్ బ్రేకర్…ఇది అసహనం పై గొంతువిప్పుతున్న వివేచనకు కొత్త సత్తువ…ఇది తీపిమాటల అణచివేతతో బిక్కచచ్చిపోయిన ఆంధ్రప్రదేశ్ కు ఊపిరి అందించే ధైర్యం…ఇది భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ అంత ఎత్తున వున్న నరేంద్రమోదీకి లోపం ఎక్కడుందో వెతుక్కోడానికి ఒక అవకాశం…
బీహార్ ప్రజలు దేశసమస్యల ఎజెండాతో ఓటు వేయలేదు. అవినీతి మచ్చలేని నితీష్ కుమార్, అవినీతి అనగానే ముందుగా గుర్తుకొచ్చే లాలూ ప్రసాద్ యాదవ్, అసమర్ధతకు అస్తవ్యస్ధతకు చిరునామా అయిన కాంగ్రెస్ పార్టీల కూటమి ని ఆరాష్ట్ర సమస్యలు, సమీకరణాల నేపధ్యం నుంచి ప్రజలు ఘనంగా గెలిపించుకున్నారు. అక్కడబిజెపి కూటమి ఓడిపోయిందన్న భావన కలగడంలేదు. స్వయంగా నరేంద్రమోదీయే ఓటమి చెందారన్న అభిప్రాయం కలుగుతోంది.
సంక్షేమ కార్యక్రమాలు, సమర్ధత, వేలకోట్ల రూపాయల ఎన్నికల ఎరలు, రాజకీయపార్టీల భావజాలాలు…వీటినుంచే పాలకుల్ని ఎంచుకోవలసిన పరిస్ధితిలో దేశానికి కూడా ఒక మార్గదర్శనం చేయడమే బీహార్ తీర్పులో వున్న మాజిక్.
అనేకసార్లు గెలవలేకపోయిన బిజెపి, వాజ్ పాయ్, మోదీల నేతృత్వంలోనే కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. అప్పటి రాజకీయ సమీకరణల నేపధ్యంతోపాటు ఈ ఇద్దరి నాయకత్వాలనూ ప్రజలు ఆమోదించడమే ఇందుకు ముఖ్యకారణం. కాంగ్రెస్ లో అవినీతి, అసమర్ధత, ఎలావున్నా ఆపార్టీ భావజాలం ఎవరికీ అభ్యంతరకరం కాదు.
బిజెపి కి ఇలాంటి ఆమోదం లేదు. ఎజెండాలో హిందూత్వం ముఖ్యాంశంగా వున్న ఆర్ ఎస్ ఎస్ మాతృసంస్ధ అని మోదీ మొదలు బిజెపి అగ్రనాయకులు పలువురు బాహాటంగా చెప్పుకున్నారు. సమన్వయ సమీక్ష పేరుతో ఆర్ ఎస్ ఎస్ కేంద్రమంత్రులను పిలిపించి సూచనలూ ఆదేశాలూ ఇచ్చింది. అయినా కూడా పాలనా వ్యవహారాల్లోకి మతభావనలను మోదీ చొరబడనివ్వరని ఆలోచనా పరులైన ప్రజలు విశ్వసించారు. ఆర్ధికాంశాలలో విదేశీ పెట్టుబడులను రాబట్టాలనుకోవడంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికీ మోదీ ప్రభుత్వానికీ తేడా లేకపోవడాన్ని బట్టికూడా మతపరమైన భావాలకు ఈ ప్రభుత్వంలో చోటువుండదని విద్యావంతులు నమ్మారు.
అయితే సాధ్వులు, మహరాజ్ ల వంటి ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ మొదలైన సంస్ధల కీలక నాయకులే ఎమ్మెల్లేలు, ఎంపిలు అయిపోవడం, వారి భాలజాలం పాలనలోకి చొరబడిపోతుందన్న అయిష్టత పెరగడం మొదలైంది.మోదీ మౌనం వల్ల ఈ ధోరణి మరింత వ్యాపించింది. మోదీ మద్దతుదారులుగా మారిన తటస్ధులు తిరిగి తటస్ధులుగానో, వ్యతిరేకులుగానో మారిపోవడం మొదలైంది.
పశుమాంసం ఎగుమతుల్లో మూడో స్ధానంలో వున్న భారతదేశంలో గోమాంసం నిషేధాన్ని అమలు చేయడం సాధ్యంకాదు. వాస్తవాలను పక్కనపెట్టి గోమాంసం తిన్న ముస్లిం వృద్దుణ్ణి గుంపుగా దాడి చేసి కొట్టిచంపడం ప్రజల మనోభావాలను గాయపరచింది.
హేతువాదులైన ముగ్గురు కవులు రచయితలను హత్యచేయడం ఆందోళనగా మారింది. భావప్రకటనా స్వేచ్ఛకు, అసహనానికీ ఈ హత్యలు సాక్ష్యాలని నిరసిస్తూ రచయితలు తమకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వాపసు చేయడం మొదలు పెట్టారు. మరోవైపు సాంస్కృతిక రంగంలో, చరిత్రరచనారంగంలో, విశ్వవిద్యాలయాల్లో జరుపుతున్న ప్రక్షాళనలు కూడా అలజడి పెంచుతున్నాయి. సరిగ్గా ఈ నేపధ్యంలోనే దాద్రీలో గోవు మాంసం తిన్నందుకు హత్య, దేశవ్యాప్తంగా చెలరేగిన భీఫ్ వివాదమూ కలసి ప్రజల్లో పెద్ద విభజన తెచ్చాయి. అదే బీహార్ ఎన్నికల ఫలితాల్లో బయటపడింది కూడా.
దేశంలో ఇంత సంవాదం, చర్చ జరుగుతున్నపుడు, బిజెపికి సర్వస్వమూ అయిన నరేంద్రమోదీ మౌనం వీడి వుంటే పరిస్ధితి మరోలా వుండేదని ఆయనకు తెలియక కాదు. అయినా మౌనంగా వుండిపోయారంటే వివాదాస్పద భావజాలానికే మోదీ కట్టుబడి వున్నారనుకోవలసి వస్తోంది.
” కాంగ్రెస్ వారు నాశనం చేసిన దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించడానికి మోదీ బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. అయితే ఆయన పార్టీ సాధ్వులను, రుషులను, మహరాజ్ లను కట్టడి చేసి వుంటే బీహార్ లో ఈ పరిస్ధితి వచ్చేదికాదు” అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గన్ని కృష్ణ అభిప్రాయ పడ్డారు. కొంత ఏకపక్ష ధోరణి కనబరుస్తున్న బిజెపి బీహార్ ఫలితం వల్ల మిత్రుల మాటను మరింత సానుకూలంగా వినిపించుకునే ఆవకాశం వుందని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఇది అవసరమనీ కూడా గన్ని వ్యాఖ్యానించారు.
అవినీతి పరుడైన లాలూప్రసాద్ నే క్షమించి హెచ్చు సీట్లు ఇచ్చిన బీహార్ ప్రజల్లో అధికారం ద్వారా చొరబడిపోయే భావజాలం మీద తీవ్రమైన వ్యతిరేకత వుందని తేలిపోయింది. భారతీయుల స్వభావంలోని లౌకిక స్వభావమూ, మతసహనమూ బీహార్ ఫలితాల రూపంలో వెల్లడయ్యాయని బిజెపి అర్ధంచేసుకోవాలి!!