హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధినంతా కోస్తాలోనే చేస్తోందని, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తోందని ఇటీవల వినబడుతున్న వాదనలపై, విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనలో పాల్గొన్న చంద్రబాబు, రాయలసీమ అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని విస్తృతంగా మాట్లాడారు. కర్నూలుజిల్లా ఓర్వకల్లులో నిర్మించబోయే ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన బాబు, అక్కడ జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. తన కంఠంలో ప్రాణముండగా సీమకు అన్యాయం జరగనివ్వనని అన్నారు. కొంతమంది సీమకు అన్యాయం జరిగిందని అంటున్నారని, అన్యాయం ఎక్కడ జరిగిందో చెప్పాలని సవాల్ విసిరారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై చర్చకు రావాలని అన్నారు. కొందరు పెత్తందారులు పెట్టుబడులు రాకుండా అడ్డుకోటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థానిక నేతలవల్లే సీమ వెనకబాటుతనం ఏర్పడిందని చెప్పారు. తానూ రాయలసీమ వాడినేనని, తాను ఇక్కడే పుట్టి పెరిగానని అన్నారు. చివరి రక్తపుబొట్టువరకు రాయలసీమను అభివృద్ధి చేస్తానని, రాయలసీమను సస్యశ్యామలం చేసేవరకు విశ్రమించనని అన్నారు. కర్నూలు జిల్లాను అభివృద్ధి చేసేవరకు నిద్రపోనని చెప్పారు. అభివృద్ధికి ఎవరైనా అడ్డు వస్తే బుల్లెట్లా దూసుకెళ్తానని అన్నారు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చుగానీ, తనతో పెట్టుకోవద్దని, తన జోలికి వస్తే సహించనని హెచ్చరించారు. సీమకు అన్యాయం జరగనివ్వనని అన్నారు. తప్పులుంటే సరిచేసుకోవటానికి సిద్ధం అన్నారు. సీమ అభివృద్ధిని అడ్డుకుంటే ఇక్కడే మకాం వేస్తానని, అవసరమైతే బస్సులో పడుకుని ఇక్కడే తిష్ఠ వేస్తానన్నారు.
చంద్రబాబు సీమకు పలు వరాలు గుప్పించారు. కర్నూలు నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అక్కడ 900 ఎకరాలలో విద్యాధామం ఏర్పాటు కానుందని చెప్పారు. కడపలో హజ్ హౌస్ ఏర్పాటు చేస్తున్నామని, ఉర్దూకోసం ప్రత్యేకంగా డీఎస్సీ నిర్వహిస్తామని అన్నారు. ఉర్దూ యూనివర్సిటీకి 125 ఎకరాలను కేటాయిస్తామని ప్రకటించారు. ముస్లిమ్‌లు అధికంగా ఉన్నచోట షాదీఖానా, ఈద్గా లాంటివాటిని ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కర్నూలులో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం ఆయన గోరుకల్లు చేరుకుని రిజర్వాయర్ పనులను పరిశీలించారు.