వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా తరపున పోటీ చేస్తున్న నల్లా సూర్యప్రకాష్ తరపున వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు స్వయంగా ప్రచారం చేయబోతున్నారు. ఆయన కంటే ముందుగా ఒకప్పటి సినీ నటి మరియు ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా ప్రచారం చేయబోతున్నారు. రోజా ఒక ఫైర్ర్ బ్రాండ్ లీడర్ అని అందరికీ తెలుసు. ఆంధ్రాకు చెందిన ఆమె తెలంగాణాలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలలో ప్రచారానికి వస్తున్నారంటే దానర్ధం అధికార తెరాసపై, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగే అవకాశం ఉంటుంది.
ఇంతకాలం తెరాసతో ‘దోస్తీ’ నిభాయించిన వైకాపా ఇప్పుడు దానితోనే ఎన్నికలలో యుద్దానికి దిగడం చాలా ఆశ్చర్యం ఇంకా అనుమానం కూడా కలిగిస్తోంది. తెరాసతో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ, తెరాసకు లబ్ది చేకూర్చడానికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగుతున్నారని ఇప్పటికే తెదేపా, బీజేపీలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఎన్నికలలో తమ పార్టీ కూడా పోటీ చేయబోతోందని వైకాపా ప్రకటించినప్పటికీ తెరాస నుండి ఎటువంటి స్పందించలేదు. కానీ మిగిలిన పార్టీల అభ్యర్ధుల గురించి తెరాస మాట్లాడింది.
తెరాసను వైకాపా ఎంత గట్టిగా వ్యతిరేకిస్తే అంతగా తెరాసకు లాభం, తెదేపా-బీజేపీలకు నష్టం జరుగుతుంది. వైకాపా చేయబోయే తెరాస వ్యతిరేక ప్రచారం వలన తెరాసకు ఏ మాత్రం నష్టం ఉండదు కానీ తెదేపా-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి డా. దేవయ్య చాలా నష్టపోవచ్చును. ఆంధ్రా నుండి వచ్చిన జగన్, రోజా ఇరువురూ తెరాసను విమర్శించినపుడు తెరాస కూడా మళ్ళీ తన తెలంగాణా అస్త్రాన్ని బయటకు తీసి వారిపై ప్రయోగిస్తుంది. ఆంధ్రా పార్టీలకు తెలంగాణాలో ఏమి పని?అని ప్రశ్నించి, వారి, లేదా వారు బలపరుస్తున్న అభ్యర్ధులను ఓడించి, ‘ఇంటి పార్టీని’ గెలిపించమని కోరుతుంది. అప్పుడు సహజంగానే తెలంగాణా ప్రజలు తెరాసవైపే మొగ్గవచ్చును. బహుశః అందుకే ఫైర్ర్ బ్రాండ్ లీడర్ గా ముద్రపడిన రోజాను కూడా వైకాపా రంగంలోకి దింపుతున్నట్లుంది.