ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా చాలా ఉదృతంగా పోరాటాలు చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దాని కోసం గుంటూరులో వారం రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేసారు. కానీ ఆ దీక్షకు ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన రాకపోవడం, ఆ దీక్షను చాలా అవమానకర పరిస్థితుల్లో ముగించవలసి రావడంతో, ఆ తరువాత వైకాపా నేతలు, వారి మీడియా కూడా ప్రత్యేక హోదా ఊసు ఎత్తడం మానేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై తమ పోరాటాలు కొనసాగించేందుకు అటువంటి బలమయిన అంశం మరొకటి దొరకనందున మళ్ళీ ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మొదలుపెట్టేందుకు వైకాపా సిద్దం అవుతోంది. ఈనెల 25న కాకినాడలో యువభేరి పేరిట పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విద్యార్ధులు, నిరుద్యోగులతో సమావేశం కానున్నారు. ప్రత్యేక హోదా వలన కలిగే ప్రయోజనాలను, అది రాకపోవడానికి కారణాలను వారికి వివరించి వారిని చైతన్యపరుస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.