విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కు తీసుకోవాలని వైకాపా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేసారు. ఆమె తన అనుచరులతో కలిసి బాక్సైట్ తవ్వకాలు జరుపబోయే ప్రాంతాన్ని నిన్న సందర్శించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయకపోతే త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలో నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడి నుండే పోటీ చేసి ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని రుజువు చేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నాతో పోటీకి వచ్చినా ఆయనను ఎదుర్కోవడానికి నేను సిద్దం. లేకుంటే తెదేపాలో ఎవరు పోటీ చేసినా నేను రెడీ. బాక్సైట్ తవ్వకాలు అజెండాగా ఉప ఎన్నికలు జరిపించుదాము. ఒకవేళ తెదేపా అభ్యర్ధి నా చేతిలో ఓడిపోయినట్లయితే చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ తెదేపాకు అంత దైర్యం లేకపోతే తక్షణమే బాక్సైట్ తవ్వకాల ఆలోచన విరమించుకోవాలి,” అని అన్నారు.
ఆమె మాటలు వింటే ఆమె బాక్సైట్ తవ్వకాలకువ్యతిరేకంగా పోరాడాలని అనుకొంటున్నారా లేక తమా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని పోరాడాలనుకొంటున్నారా? అనే అనుమానం కలుగుతోంది. ఆమె ఎవరో రాష్ట్ర ప్రజలెవ్వరికీ తెలియదు కానీ ఆమె ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తనతో పోటీ చేయమని కోరడం చాలా హాస్యాస్పదంగా ఉంది.