రాయలసీమకు చెందిన కాంగ్రెస్, వైకాపా నేతలు కలిసి ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ త్వరలో ఉద్యమాలు మొదలుపెట్టబోతున్న వార్తలు చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సకాలంలోనే స్పందించినట్లున్నారు. ఆయన కడప, కర్నూల్ జిల్లాలలో పర్యటించి ఆ రెండు జిల్లాలకు అనేక వరాలు కురిపించారు. అనంతరం తను కూడా సీమకు చెందిన వ్యక్తినేనని, సీమ అభివృద్ధి కోసం తను కృషి చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు రాజకీయ నిరుద్యోగులు సీమ అభివృద్ధి జరుగకుండా అడ్డుకోనేందుకే సీమ ప్రజలను రెచ్చగొడుతూ వారె అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారుగత 15 నెలల్లో సీమ ప్రాంత అభివృద్ధి కోసం తన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఇక ముందు చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించి, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు గత పదేళ్ళ కాలంలో రాష్ట్రాన్ని పరిపాలించినపుడు సీమ ప్రాంత అభివృద్ధికి ఏమి చేసారో చెప్పాలని సవాలు విసిరారు. . సీమ అభివృద్ధికి అడ్డుపడితే తను బుల్ డోజరులా దూసుకుపోతానని హెచ్చరించారు. తన ముందు వారి వేషాలు నాటకాలు సాగవని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు సకాలంలోనే మేల్కొన్నట్లే ఉన్నారు. కానీ ఆయన సీమ అభివృద్ధి చేయడం గురించి చెప్పిన తన మాటలను చేతలలో చూపించినపుడే, ప్రతిపక్షాల ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమాలను అడ్డుకట్టవేయగలరు. అలాగే రాయలసీమలో తెదేపా కార్యకర్తలు, నేతలు, మంత్రులు అందరిని సమన్వయపరిచి కలిసికట్టుగా ప్రతిపక్షాలను రాజకీయంగా కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.