బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయానికి కారణాలు ఏవయినప్పటికీ దాని ప్రభావం బీజేపీపై చాలా ఉంటుంది. ఒకవేళ ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచి ఉండి ఉంటే ఇక దానిని అడ్డుకోవడం ఎవరితరం అయ్యేది కాదు. కానీ చాలా ఘోరంగా ఓడిపోవడంతో బీజేపీ దూకుడుకి కళ్ళెం పడినట్లయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించినంత వరకు చూసుకొంటే, తెదేపా-బీజేపీల స్నేహం ఇష్టంలేని కాపురంలాగ సాగుతోందని రెండు పార్టీల నేతలు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వ సహాయసహాకారాలు అవసరమనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయుడు మోడీకి అణిగిమణిగి ఉంటున్నారనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా మోడీ రాష్ట్రానికి చెయ్యి విదిలించడం లేదు. పైగా రాష్ట్ర బీజేపీ నేతలు తెదేపా ప్రభుత్వానికి పక్కలో బల్లెంలాగ తయారయ్యారు. వారు తమ పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సంగతి మరిచిపోయి, ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం తీసిపోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బిహార్ లో బీజేపీ ఘోరపరాజయం పొందడం, బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుండటం, తెదేపాకు కొత్త ఆలోచనలను కల్పించినట్లయింది. ఒకవేళ కేంద్రప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు తమ ప్రభుత్వంతో ఇదేవిధంగా వ్యవహరించినట్లయితే, మున్ముందు పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు కూడా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక కూటమిని తయారుచేసే ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చును. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో బీజేపీకి చాలా నష్టం కలుగవచ్చును. కనుక రాష్ట్ర బీజేపీ నేతలు తెదేపా ప్రభుత్వ పరిస్థితిని అర్ధం చేసుకొని దానితో సంయమనంగా వ్యవహరించడం మంచిది.