కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ టెలిఫోన్ లో నితీశ్ కుమార్ కు శుభాకాంక్షలు చెప్పడం మినహా బీహార్ ఫలితాల మీద కాంగ్రెస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.కాంగ్రెస్ కు కొత్త ఊపిరి పోసిన బీహార్ ఎన్నికల ఫలితాలే రాహుల్ రాజకీయ భవిష్యత్తుకి అవరోధంగా కూడా ఎదురౌతున్న క్లిష్టపరిస్ధితి సోనియా ముందు వుంది. ఇపుడు ఏ వైపు ప్రయాణం సాగించాలో తేల్చుకోలేని జంక్షన్ లోకి కాంగ్రెస్ చేరుకోవడమే సోనియాగాంధీ వ్యూహాత్మక మౌనానికి కారణమని అర్ధమౌతోంది.
వచ్చే సాధారణ ఎన్నికలనాటికైనా బిజెపికి – కాంగ్రెస్, నరేంద్రమోదీకి రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయం కాగలరనుకుంటున్న కాంగ్రెస్ ఆశల్ని బీహార్ ప్రశ్నార్ధకం చేసింది. బీహార్ గెలుపంటే నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా నితీశ్ కుమార్ ఆవిర్భావమే అనే భావన దేశ రాజకీయాల్లో వ్యాపిస్తోంది.
ఈ నేపధ్యంలో మహా కూటమికి మద్దతుగా ఒక మాటచెప్పినా రాహుల్ వెనుక వరుసలోకే వెళ్ళిపోతాడు. ఏడాదిలో జరిగే కేరళ,తమిళనాడు, పాండిచేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పొత్తుల మాట అటుంచి ఈ నెల 26 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించవలసిన వ్యూహం గురించి కూడా ఒక అంచనాకు రాలేని పరిస్ధితి కాంగ్రెస్ ముందు వుంది.
పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీయవలసన స్ధితిలో ఇతర విపక్షాలతో కలిసిపోవాలా? లేక ఒంటరి పోరాటం చేయాలా? ఈ విషయమై సోనియా ఒక నిర్ణయానికి వచ్చేదాకా ఆమె మౌనం కొనసాగుతూనే వుంటుంది.
మహాకూటమి విజయ ప్రస్థానం.. యూపీఏ చాపకిందకు నీరు తెస్తుందా? అది రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుకు ప్రతిబంధకమవుతుందా? మహాకూటమితో జట్టుకట్టడం బీహార్లోనైతే మంచి ఫలితాలను ఇచ్చింది. కానీ అదే రీతిగా జాతీయ స్థాయిలో మహాకూటమితో చేతులు కలిపితే.. అంతంతమాత్రపు ప్రజాకర్షణతో నెట్టుకొస్తున్న రాహుల్ గాంధీ స్థానం ఎక్కడ ఉంటుంది? నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్.. ఇలా సరిగ్గా ఆ సమయానికి వెలుగులోకి వచ్చే రాజకీయ దిగ్గజాల వెలుగు ముందు కొడిగట్టిన దీపంలా మసకబారిపోతారా? …ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి!!