ఈ దీపావళి రోజున ప్రధానమంత్రి మోదీకి మనశ్శాంతి లేకుండాపోయింది. రెండు దీపావళులు జరుపుకోవాలని కలకంటే చివరకు అసలు దీపావళే అంధకారబంధురమైపోయింది. సొంత పార్టీ సీనియర్లు తమ పొగ్రస్ రిపోర్ట్ లో మోదీకి 35 (పాస్) మార్కులే పడ్డాయి. ఈ అత్తెసరు మార్కులు చూసేసరికి మోదీ తెల్లముఖం వేయాల్సివచ్చింది. మోదీలోని పాలనా సామర్థ్యాన్ని ఎండగడుతూ ముక్కచివాట్లు పెట్టడానికి పార్టీ పెద్దలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
`అంతా కాలమహిమే..’ అంటూ మోదీ ఇప్పుడు తనకుతానే సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఆత్మసాక్షి కి సమాధానం చెప్పలేని పరిస్థితి ఇది. అంతా అనుకూలంగా ఉంటే మోదీ, ఈరోజున నాలుగురోజుల వ్యవధిలో రెండోసారి దీపావళి పండుగను ఘనంగా జరుపుకునేవారు. కానీ, అందుకుభిన్నంగా పార్టీలోని సీనియర్ల నుంచి `మొట్టికాయల రిపోర్ట్’ అందుకోవాల్సి వచ్చింది. ఏడాదిన్నర పాలనలో తనకుతానే సాటి అనుకున్న మోదీకి సొంత పార్టీలోనే ఎదురుగాలి తప్పలేదు. ఇంతవరకూ చాపక్రింది నీరులా ఉన్న అసంతృప్తి పార్టీ సీనియర్ల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కళ్లు ఇప్పుడు మోదీనే చూస్తున్నాయి. పార్టీ మార్గదర్శకమండలి మోదీ విషయంలో ఎలాంటి మార్గాన్ని నిర్దేశిస్తుందో చూడాలి. బిహార్ వైఫల్యాన్ని దృష్టిలోపెట్టుకుని సీనియర్లు ఇచ్చిన సంయుక్త ప్రకటన చదివితే, మోదీకి పార్టీలోని కురువృద్ధులు కేవలం పాస్ మార్కులే (35) వేసినట్లు అనిపిస్తోంది.
కేవలం ఒక రాష్ట్ర ఫలితాలను ఆధారంగా చేసుకుని అద్వానీ, అరుణ్ శౌరీ, మురళీ మనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా వంటి ప్రముఖులు మోదీని నిలదీయడం పైపైన చూసినప్పుడు ఈ తిరుగుబాటు సరైనది కాదేమోననిపించవచ్చు. కానీ, బిహార్ ని మిగతా రాష్ట్రాల ఎన్నికలతో ముడిపెట్టలేనంతగా మోదీనే ప్రాముఖ్యత కల్పించారు. నిజానికి అంతటి ప్రచారం ఏదో ఒక రాష్ట్ర ఎన్నికలకు కల్పించాల్సింది కానేకాదు. ఇదంతా మోదీ మంత్రమహిమ. ఆయన పక్కనున్న పార్టీ అధ్యక్షుడు అమిత్ షా టక్కుటమార విద్యలు. ప్రజాస్వామిక యుద్ధంలో మహిమలు, మంత్రాలు, టక్కుటమారాలకు ఓటర్లు ఫ్లాటైపోతారని వీరిద్దరూ అనుకున్నారు. కృష్ణార్జునుల్లా బిహార్ దున్నేశామనుకున్నారు. కానీ చివరకు పల్టీకొట్టారు. సీనియర్ల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
బిహార్ వైఫల్యంపై బిజెపీ ఎలాగో కూలంకుషంగా సమీక్షిస్తుంది. ఓడిన పార్టీ ఏదైనా అదే పని చేస్తుంది. ఇదంతా మామూలుగా జరిగే తంతే. 2014లో కాంగ్రెస్ కుప్పకూలిపోయిన తర్వాత ఇలాంటి రివ్యూ చేసింది. చివరకు తన స్టేట్ మెంట్ లో , యూపీఏ కూటమి, ప్రభుత్వం అద్భుతమైన పథకాలతో చక్కటి పాలన అందించిందనీ. అయితే ఇదే విషయాన్ని ఓటర్లకు అర్థమయ్యేలా వివరించడంలో విఫలమైందని సంజాయిషీ ఇచ్చుకున్నారు. అలాగే, బిజెపీ గతంలో వైఫల్యాలను ఎదుర్కున్నప్పుడు సమీక్షించుకుంది. తామెంతగా కష్టపడినా ఫలితం దక్కలేదనో, దురదృష్టం వెంటాడిందనో తేల్చిపారేసేవారు. దీంతోపాటు ఒకరిమీద మరొకరు బురదజల్లుకునేవారు. కానీ ఈసారి అందుకుభిన్నంగా ఏకవ్యక్తి (మోదీ)నే అగ్రనేతలంతా
టార్గెట్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ కి పరిమితం కాకుండా దేశ రాజకీయాల సీన్ లోకి ఎప్పుడైతే ఎంటరయ్యారో, అప్పటి నుంచి పార్టీలో ఏకవ్యక్తి హవా ఎక్కువైంది. చివరకు మోదీ కారణంగానే బిజెపీలో ముసలం పుట్టేలాఉంది.
స్కూల్ పిల్లవాడు పరీక్షలో వంద మార్కులకుగాను, కేవలం పాస్ మార్కులు (35) మాత్రమే తెచ్చుకుంటే ఏ తల్లిదండ్రులు హర్షిస్తారు చెప్పండి ? ఎందుకు ఇలా జరిగిందని నిలదీయరా ? మిగతా 65 మార్కులు ఎవరికిచ్చావురా ? అసలు నువ్వు స్కూలుకెళ్ళి చదువుకుంటున్నావా? బలాదూర్ తిరుగుళ్లతో గాడిదలు కాస్తున్నావా? నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఆర్థికంగా చితికిపోయిన ఇంటిని బాగుచేసేవాడివి నువ్వేననుకున్నాం. కానీ ఇలా చేశావేంటిరా.. బడుద్దాయ్. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, లేకపోతే సెంటర్లో టీ కొట్టుపెట్టుకోవాల్సిందే… అంటూ తిట్టరా.. ఇప్పుడు మోదీ విషయంలో సీనియర్ల కూడా అదే చేయబోతున్నారా?.
2014 ఎన్నికలకు ముందు మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించేటప్పుడే పార్టీనేతల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఎన్డీయే కూటమి నుంచి భాగస్వామి అయిన జేడియు విడిపోయింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిజేపీతో స్నేహాన్ని తెంపుకున్నారు. అయినప్పటికీ మోదీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలో కొనసాగారు. చివరకు ఎన్డీయే ఘనవిజయం సాధించింది. ప్రధాని అయినతర్వాత మోదీ నిజస్వరూపం నెమ్మదిగా బయటపడింది. ఈ ఏడాదిన్నర పాలనలో ఆయన పార్టీ సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకోలేదు. పెద్దలను గౌరవించడమన్నది కూడా నాటకీయంగా కొనసాగించారు. ఈ వింత పోకడ మొదటి నుంచి బిజేపీ కురువృద్ధులకు నచ్చలేదు. వయసుమీదపడటంతో ఏమీచేయలేని పరిస్థితి వారిది. ఇక మరోవైపున చిన్నాచితక నాయకుల నోర్లు మూయించి తనదైన శైలిలో పాలన సాగించే తత్వం మోదీది.
నరేంద్ర మోదీ మహా మాటకారి. గుజరాతీ వ్యాపారికుండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. దీంతో ఇండియాకు అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవస్థలో కీలకస్థానం కల్పించారు. అనేక దేశాలు చుట్టుముడుతూ, ఎక్కువసంఖ్యలోనే ఎంఓయూలు కుదిర్చారు. భారతదేశాన్ని ప్రపంచపటంలో ఘనంగా నిలబెట్టేందుకు కృషిచేశారు. సమర్థవంతమైన పాలన చేస్తున్నారనిపించారు. ఈ క్రమంలో తనలోని మైనస్ పాయింట్లను గుర్తించలేకపోయారు. తనకు అన్నీ తెలుసనుకున్నారేకానీ, అందర్నీ కలుపుకుంటూ వెళ్ళాలన్న రాజనీతి సూత్రాన్ని మాత్రం మరిచిపోయారు. ప్రతిపక్షాలను ఏ సందర్భంలోనూ కలుపుకుని సాగలేదు. అందుకే కీలకబిల్లులకు చట్టబద్ధత కల్పించడంలో తీవ్రమైన జాప్యంఎదురవుతోంది. కీలక అంశాల్లో ప్రతిపక్ష సలహాలను తీసుకోవడమన్నది ప్రజాస్వామిక పాలనలో అత్యంత ముఖ్యమైనది. దీన్ని బేఖాతరన్నారు.
ఢిల్లీలో చేతులుకాలాక, బిహార్ లో పొడిచేస్తామంటూ దూకారు. కానీ బిహారీలు మోదీని పరాయివాడిగానే చూశారు. ఆ రాష్ట్రంలో శక్తివంతమైన నాయకుడ్ని ప్రజలకు చూపించలేకపోయారు. ఇదిగో, ఇతడే సీఎం అభ్యర్థి అని చెప్పలేకపోయారు. ప్రచారసభల్లోనూ, ర్యాలీల్లోనూ అద్భుతమైన నటనాకౌశలాన్ని ప్రదర్శించారేకానీ, బిహారీల మనసుల్లో ఏముందో తెలిసుకోలేకపోయారు. ప్రజలను అర్థం చేసుకోలేని నేతలుగా ముద్రవేయించుకున్నారు. అందుకు పరిహారంగా పొగ్రెస్ రిపోర్ట్ లో చాలానే మార్కులు కోల్పోవాల్సివచ్చింది.
మోదీకి కేవలం 35 మార్కులే పడటానికి ఇవన్నీ కారణాలే. దేశమంతటా అసహనం ఉన్నదని సహనశీలత లోపించిందని కాంగ్రెస్, వామపక్షాలు గగ్గోలు చేస్తున్నా, సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు. ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోలేకపోయారు. దీంతో నిరంకుశ పాలన అన్న ముద్ర మోదీపై పడింది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సమర్థవంతమైన నాయకుడిగా మంచి మార్కులే కొట్టేసినా, మిగతా విషయాల్లో చతికిలపడ్డాడు. ప్రజలతో మమేకం కావడంలో విఫలమై మిగతా 65 మార్కులు స్వయంకృతాపరాధం వల్ల చేతులారా జారవిడుచుకున్నారు. మరి అలాంటప్పుడు మోదీని సొంత పార్టీ సీనియర్లు ముక్కచివాట్లు వేయక ఇంకా చంకనెక్కించుకుంటారా? ఇక ఇప్పుడు జరిగేది అదే.
– కణ్వస