నటినటులు: అఖిల్ అక్కినేని, సయేషా సైగల్, మహేష్ మంజ్రేకర్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్
దర్శకత్వం : వి.వి.వినాయక్
నిర్మాత: నితిన్ రెడ్డి
సంగీతం : అనూప్ రూబెన్స్, ఎస్.ఎస్.థమన్
అక్కినేంటి నట వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి మూడో తరం నుండి వస్తున్న హీరో అఖిల్. మనం సినిమాతో చివరన అలా కనిపించి అదరగొట్టిన అఖిల్ మొదటి సినిమా అఖిల్ పేరుతో రావడం విశేషం. వి.వి.వినాయక్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లో నితిన్ నిర్మించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది మరి సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ:
అఖిల్ సరదాగా సాగే వ్యక్తి.. ఫైటింగులతో కాలక్షేపం చేసే హీరోకి సడెన్ గా హీరోయిన్ ని చూడటం ఆమె ప్రేమలో పడటం జరుగుతుంది. ఆమెని ప్రేమిస్తున్నానని చెప్పకుండానే అఖిల్ ఆమె పెళ్లి ఆపడం ఆ కారణం చేత మహేష్ మజ్రేకర్ దగ్గరవడం ఇలా సాగుతుంది. పెళ్లి ఆగిపోయిన కారణం చేత హీరోయిన్ రష్యా వెళ్లిపోతుంది. అయితే ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం హీరో అక్కడకు వెళ్తాడు. ఇదిలా జరుగుతుంటే సినిమా ఓపెనింగ్ తోనే సూర్యునికి భూమికి మధ్య దూరం దగ్గరవుతుండటంతో సూర్యుని కాంతితో భవిష్యత్ లో భూమి మీద ప్రళయం సంభవించవచ్చని ఋషులు ఒక కవచాన్ని తయారు చేస్తారు. ఆఫ్రికా లో ఒక జాతి సూర్య గ్రహణం వేళ గ్రహణం వీడేప్పుడు సూర్యుడి నుండి వచ్చే మొదటి కాంతి కిరణం ఆ గోళం మీద పడేలా ప్రతిష్టిస్తారు. ఇక దాన్ని కాజేసి ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని అంతర్జాతీయ డాన్ కుట్ర పొంది వారి మీదకు దాడి చేస్తాడు. జువాని ఒక కుర్రాడితో తప్పించి అది వారికి దక్కకుండా చేస్తారు. సినిమా మెయిన్ పాయింట్ ఈ కవచాన్ని మళ్లీ వారికి అప్పగించడమే. అసలు అఖిల్ ఆఫ్రికా ఎందుకు రావాల్సి వచ్చింది..? అఖిల్ కి జువాకి ఉన్న సంబంధం ఏంటి..? అన్నది సినిమా అసలు కథ.
టెక్నికల్ డిపార్ట్మెంట్ :
సినిమాకు టెక్నికల్ డిపార్ట్మెంట్ సహకారం బాగా అందింది. సినిమాకు కథ వెలిగొండ శ్రీనివాస్ అందించాడు. మండే అగ్నిగోళం లాంటి సూర్యుడి నుండి భూమిని కాపాడటం ఎలా అని కథని బాగానే రాసుకున్నాడు. అయితే కథలో హీరో ఇన్వాల్వ్ మెంట్ తక్కువగా ఉండటం కాస్త ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తుంది. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ నెస్ ని తెచ్చిపెట్టింది. స్పెయిన్, బ్యాంకాక్ లొకేషన్స్ ని అద్భుతంగా చూపించారు. అనూప్ రూబెన్స్ , థమన్ సాంగ్స్ సినిమాకు మంచి ప్లస్ అయ్యాయి. డ్యాన్సులకు అనువైన ట్యూనస్ ఇచ్చి సినిమాకు మంచి జోష్ ని ఇచ్చారు. ఇక సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా హై వోల్టేజ్ తో ఉంటాయి. ఇక కొన్ని సీన్లలో సిజి వాడినా ఇంకాస్త బెటర్ మెంట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. దర్శకుడిగా వినాయక్ తన పనితనాన్ని మరోసారి చూపించగా, నిర్మాత నితిన్ తన ప్రొడక్షన్ వాల్యూస్ ని బాగా రిచ్ గా చూపించాడు.
విశ్లేషణ:
కథ దాన్ని చెప్పే విధానం బాగున్నా సినిమాలో హీరో అఖిల్ ఇన్వాల్వ్ మెంట్ లేకపోవడం కాస్త బోర్ కొట్టింది. కేవలం హీరోయిన్ కోసమే తాను రకరకాల ప్రయత్నాలు చేయడం. మెయిన్ స్టోరీకి హీరో లాస్ట్ కనెక్ట్ అవ్వడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది. సినిమా కథ కూడా అంతగా ఆడియెన్స్ కి రీచ్ అవ్వలేదు. ఇక వినాయక్ డైరక్షన్ పరంగా ఓకే అనిపించుకున్నా అఖిల్ హీరోయిజం ని ఎక్కడా చూపించలేక పోయాడని చెప్పొచ్చు. అఖిల్ మాత్రం డ్యాన్సులత్రో అదరగొట్టాడు. ముందునుండి చెప్పుకొస్తున్న అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఇంకా ఏదో మిస్ అయ్యింది అనిపిస్తుంది. హీరోయిన్ సయేషా సైగల్ కూడా సినిమాలో అంతంత మాత్రం గానే అభినయాన్ని ప్రదర్శించింది. సినిమా కథ కొత్తగా ఆలోచించినా దానిలో హీరోని ఉపయోగించుకోవడంలో తప్పులు తడకలు ఉన్నాయి. కేవలం చివర వరకు హీరోయిన్ కోసమే రిస్కులు చేస్తుంటాడు కాని అఖిల్ అసలు సినిమా మెయిన్ స్టోరీకి కనెక్ట్ అవ్వడు. సినిమా మ్యూజిక్ పరంగా ఓకే. సినిమాటోగ్రఫీ లొకేషన్స్ సూపర్బ్. సినిమా స్టార్ట్ చేసినప్పుడే అసలు కథ చెప్పేసిన రచయిత, దర్శకుడు సినిమా నడుస్తున్నప్పుడు ఆ మూలాధారమైన కథని అశ్రద్ధ చేసి మిగతా వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు.
ప్లస్ పాయింట్స్:
అక్కినేని వారసుడిని ఎలా చూడాలనుకున్నారో అచ్చం అలానే ఒక మిసైల్ లా వచ్చాడు అఖిల్. డ్యాన్సులైతే అఖిల్ కుమ్మేశాడని చెప్పొచ్చు. ప్రస్తుతం కాంపిటీషన్ ప్రపంచంలో స్టార్ హీరో కొడుకైనా సరే టాలెంట్ లేందే తప్పదని ట్రైన్ అయ్యి మరి సినిమాలో తన పవర్ ని చూపించాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. హీరోయిన్ సయేషా సైగల్ కూడా మొదటి పరిచయం అయినా తెర మీద అందం అభినయంతో ఆకట్టుకుంది. సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి. సినిమాలో ఆర్ట్ వర్క్ కూడా బాగుంది, ఇంకా అఖిల్ సినిమాకు రన్ టైం కూడా కలిసి వచ్చే అంశమే. కమెడియన్ బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, జయప్రకాశ్ రెడ్డి తమ తమ పాత్రల మేరకు హాస్యాన్ని పండించారు.
మైనస్ పాయింట్స్ :
సినిమా కథ మొత్తం ముందే రివీల్ చేసిన దర్శకుడు దాన్ని బాలెన్స్ చేయడంలో తప్పులు చేశాడు. సినిమా మెయిన్ లైన్ కి హీరో కనెక్ట్ అవ్వకపోవడం కాస్త ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. అఖిల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టినా అక్కడక్కడ కొన్ని సీన్స్ లో ఇంకా నైపుణ్యత ప్రదర్శిస్తే బాగుండేది. హీరోయిన్ సయేషా సైగల్ ఉన్నంత వరకు బాగానే ఉన్నా ఇంకాస్త బబ్లీగా ఉంటే ఆడియెన్స్ కి నచ్చేది. ఇక వినాయక్ డైరక్షన్ గురించి చెప్పాల్సి వస్తే సినిమాని స్టార్ట్ చేసిన విధానంతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్తాడనుకున్న ఆడియెన్స్ కి నిరాశే మిగుల్చుతాడు. సినిమా నడుస్తున్నా కొద్ది అసలు పాయింట్ మీద కాకుండా మిగతా విషయాల మీద సినిమా నడవడం ఆడియెన్స్ కొద్దిగా బోర్ ఫీలవుతారు. సెకండ్ ఆఫ్ కథనంలో అసలు ఆడియెన్స్ ని అలరించేలా ఉండదు. నితిన్ నిర్మాణ విలువలు బాగానే ఉన్నా సిజి వర్క్ లో ఇంకాస్త జాగ్రత్త పడి ఉండే బాగుండేది.
తీర్పు:
అక్కినేని యువ హీరో అఖిల్ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేస్తుంది అనుకుంటున్న అక్కినేని అభిమానులకు ఈ సినిమా ఆ రేంజ్లో కాకపోయినా ఆడియెన్స్ కి మంచి ఫీల్ ఇస్తుంది. సినిమా కథ కథనాల్లో కొద్దిగా లోపాలు ఉన్నా మొత్తం సినిమా అక్కినేని అభిమానులకు ఫుల్ జోష్ నింపేస్ సినిమాగా ఉంది. ఇక సగటు సిని ప్రేక్షకుడు కూడా అఖిల్ పర్ఫార్మెన్స్ అతని డ్యాన్సుల గురించైతే సినిమా చూడొచ్చు. ముందునుండి చెప్పుకుంటున్నట్టుగా అక్కినేని ఫ్యామిలీ నుండి ఓ మాస్ కమర్షియల్ హీరో ఈ సినిమాతో వచ్చాడనే చెపొచ్చు. సరదాగా సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చుతుంది.
తెలుగు360రేటింగ్: 2.25/5