రాష్ట్ర విభజన చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మునిగిపోబోతోందని గ్రహించిన అనేకమంది కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు, ఆ తరువాత తెదేపా, బీజేపీ, వైకాపాలలోకి దూకేశారు. మూడు పార్టీలలో కాంగ్రెస్ నేతలున్నారు. ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ పార్టీలు మారడంతో శత్రువులుగా మారిపోక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వారు విభేధించుకొన్నప్పటికీ, అప్పుడు వాటిని బయటపెట్టుకొంటే చాల ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతో మౌనం వహించక తప్పేది కాదు. కానీ ఇప్పుడు అందరూ వేర్వేరు పార్టీలలో ఉన్నారు కనుక ఇక ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
మిత్రపక్షాలుగా ఉన్న తెదేపా, బీజేపీల మధ్య ప్రస్తుతం ఆధిపత్య పోరు జరుగుతోంది. దాని కోసం ఆ రెండు పార్టీలు తమ పార్టీలలో ఉన్న కాంగ్రెస్ నేతల సేవలు ఉపయోగించుకొంటున్నట్లుంది. బీజేపీలోని కాంగ్రెస్ నేతలు పురందేశ్వరి, కావూరి, కన్నా లక్ష్మి నారాయణ తదితరులు తెదేపా ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, తెదేపాలోని రాయపాటి, గంటా శ్రీనివాసరావు వంటి కాంగ్రెస్ నేతల చేత వారికి తెదేపా జవాబు చెప్పిస్తోంది. వారి పోరాటాలు చూస్తుంటే తెదేపా, బీజేపీలు పోరాడుకొంటున్నాయా…లేక కాంగ్రెస్ నేతలే తమలో తాము పోరాడుకొంటున్నారా? అని అనుమానం కలుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి వారిలో ఎందరు తెదేపా-బీజేపీలలో ఉంటారో..ఎందరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లిపోతారో తెలియదు. ఒకవేళ అటువంటి పరిస్థితే వస్తే అప్పుడు తెదేపా-బీజేపీ నేతల మధ్య సఖ్యత చాలా అవసరం. కనుక ఆ రెండు పార్టీలు చాలా దూరదృష్టితో ఆలోచించి తమ స్వంత పార్టీ నేతల ద్వారా కాకుండా కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ నేతల చేతనే జవాబులు చెప్పిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. దాని వలన సదరు కాంగ్రెస్ నేతలు కూడా ప్రజలలో తమ ఉనికి కోల్పోకుండా కాపాడుకోగలుగుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తమ ప్రత్యర్దులపై పైచెయ్యి సాధించగలరు కనుక వారు కూడా అందుకు ‘సై’ అంటున్నట్లున్నారు.