హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నిక దగ్గరపడుతుండటంతో అన్నిపార్టీలూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇవాళ వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ అహంకారం వలనే వరంగల్ ఉపఎన్నిక వచ్చిందని జైపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు బుద్ధిచెప్పే అవకాశం వరంగల్ ప్రజలకే ఉందని చెప్పారు. కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి వినమ్రత అనేది కొద్దిగా కూడా లేదని, ఆ పదం వారి నిఘంటువులోనే లేదని అన్నారు. పొంతన లేని పాలన, దిక్సూచి లేని నిర్ణయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో డిప్యూటీ సీఎం పదవికి విలువ లేదని, రాజయ్యను బర్తరఫ్ చేసి దళితులను కేసీఆర్ అవమానించారని ఆరోపించారు. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను 18 నెలల్లో దివాళా తీయించారని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చటంలో కేసీఆర్ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. వరంగల్ ఉపఎన్నికలో కేసీఆర్కు పరాభవం తప్పదని చెప్పారు.