కేంద్రప్రభుత్వం నుంచి రెగ్యులర్ గా రావలసిన నిధుల్లో 27 వేలకోట్ల రూపాయలు విడుదల కాలేదు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల నుండి కూడా ఆశించిన వృద్ధి కనిపించడంలేదు. రాష్ట్ర బడ్జెట్ లో ఇప్పటికే 10 వేలకోట్ల రూపాయలు అదనంగా ఖర్చయిపోయింది. ఖర్చులు తగ్గించుకుంటేకాని లోటు పూడ్చుకోలేని అవస్ధతో ఆంధ్రప్రదేశ్ సతమతమౌతోంది.
రాష్ట్ర ఖజానాలో నిధులు లేవు. ఖర్చులు తగ్గించుకోండి. అదనపు బడ్జెట్ ఎవరూ అడగకండి అని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అన్ని శాఖలకూ సర్కులర్ పంపింది. కేంద్రం నుంచి రొటీన్ గా రావలసిన నిధులు కూడా విడుదల కాకపోవడమే ఈ పరిస్ధితికి ప్రధాన కారణమని ఆశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రెండురోజుల క్రితం జరిపిన సమీక్షా సమావేశంలో స్పష్టమైపోయింది.
కేంద్రం నుండి వివిధ అకౌంట్ల కింద రాష్ట్రానికి 27వేల కోట్ల రూపాయిలు రావల్సి ఉండగా, కేవలం ఏడు వేల కోట్ల రూపాయిలు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రంలో వార్షిక రెవిన్యూ లోటు భర్తీ, జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిధి, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్యాకేజీ, పరిశ్రమలకు అభివృద్ధికి గ్రాంటు, 13వ ఆర్ధిక సంఘం గ్రాంటు, రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు చాలా ఉన్నాయి. ఇందులో పారిశ్రామిక గ్రాంట్ కింద 1500 కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సి ఉంది. రెవిన్యూ చట్టంలో లోటును పూర్తిగా భరిస్తామని కేంద్రం చెప్పినా అది నేటి వరకూ నెరవేరలేదు. రెవిన్యూ లోటు 14,413 కోట్లును కేంద్రం మంజూరు చేసినా, అందులో వచ్చిన నిధులు మాత్రం 2300 కోట్లు అని అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రకృతి వైపరీత్య నిధి కింద 2,272 కోట్లు ఇస్తామని చెప్పినా ఇచ్చింది మాత్రం 347 కోట్లు మాత్రమే.
రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద గత ఏడాది 350 కోట్ల రూపాయలు ఇచ్చినా ఈ ఏడాది నిధులు ఇంకా ఒక్క రూపాయి కూడా రాలేదు. 13వ ఆర్ధిక సంఘం నిధులు 4163 కోట్లకు ఆనూ 3493 కోట్లు మాత్రమే వచ్చాయి.
రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుకంటే , ఇప్పటికే 10వేల కోట్ల రూపాయిలు అదనంగా ఖర్చు చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు విధానాన్ని మార్చడం లెవీ విధానాన్ని తొలగించడంతో ఎపికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. లోటు పూడ్చుకోడానికి ఖర్చులు తగ్గించుకోవడం మినహా మరో మార్గం కనబడటం లేదు.
2015-16 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిఎన్ని రకాలుగా పరిస్థితులను అదుపులో ఉంచినా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయిలు లోటు కనిపిస్తోంది. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల నుండి కూడా ఆశించిన వృద్ధి కనిపించలేదని. ఉద్యోగుల స్పెషల్ అలవెన్స్‌పై వారంలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు యనమల రామకృష్ణుడు అన్నారు.ఉద్యోగుల జీతానికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని చెప్పారు.