హైదరాబాద్: ప్రధాని పదవి చేపట్టిన దగ్గరనుంచి వరసగా చేస్తున్న విదేశీయాత్రల గురించి ఎన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా నరేంద్ర మోడి వాటిని ఏమాత్రం పట్టించుకుంటున్నట్లుగా లేదు. తన దారి తనదే అనే టైపులో సాగిపోతున్నారు. ఇటీవల బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి మీడియాతో మాట్లాడుతూ, నరేంద్రమోడి విదేశీయాత్రలు, ఊకదంపుడు ఉపన్యాసాలు కట్టిపెట్టి ఇకనైనా పని ప్రారంభించాలని చురకలు అంటించిన సంగతి తెలిసిందే.
మూడు రోజుల పర్యటనకోసం మోడి ఈ ఉదయం బ్రిటన్ బయలుదేరి వెళ్ళారు. ప్రధాని హోదాలో ఆయన బ్రిటన్ పర్యటించటం ఇదే మొదటిసారి. యూకే వెళుతున్నానని, తన పర్యటన భారత్, యూకే మధ్య ఆర్థిక సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తాయని మోడి ఈ ఉదయం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు భారత్‌కు వస్తాయని ట్వీట్ చేశారు. లండన్ చేరగానే మొదట ఆ దేశ ప్రధాని డేవిడ్ కేమరూన్ అధికార నివాసం – 10, డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్ళి ఆయనతో మోడి చర్చలు జరుపుతారు. తర్వాత పార్లమెంట్‌కు వెళ్ళి అక్కడ మహాత్మా గాంధి విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత పార్లమెంట్‌లో మాట్లాడతారు. రాత్రికి బకింగ్‌హామ్‌షైర్‌లో ప్రధాని కేమరూన్ నివాసంలో ఆయన ఆతిథ్యం స్వీకరిస్తారు. శుక్రవారం లండన్‌లో సీఈఓల సమావేశం ఒకదానిలో పాల్గొంటారు. శనివారం లండన్ నుంచి అంకారా వెళ్ళి జీ-20 సదస్సులో మోడి పాల్గొననున్నారు.