హైదరాబాద్: ఈ దీపావళి పండుగను పురస్కరించుకుని మొన్న 10వ తేదీన తమిళంలో రిలీజైన్ ‘వేదాళమ్’, ‘తూంగ వనం’ సినిమాలు రెండూ విజయపథంలో దూసుకెళుతున్నాయి. అజిత్ నటించిన ‘వేదాళమ్’ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమా అయినప్పటికీ అజిత్ యాక్షన్ కారణంగా ఆకట్టుకుంటోంది. శ్రుతి హాసన్, లక్ష్మీ మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆవేశం’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ రికార్డ్ స్థాయిలో మొదటి రోజే రు.15.5 కోట్ల ఓపెనింగ్స్ గడించింది. రెండో రోజుకూడా రు.10 కోట్లు రాబట్టిందని అంటున్నారు. తెలుగు నిర్మాత ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రాన్ని, తెలుగులో ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివ రూపొందించారు. అజిత్-శివ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘వీరం’ హిట్ కాగా, ఇప్పుడు ‘వేదాళం’కూడా హిట్ టాక్ తెచ్చుకోవటంతో మూడో చిత్రానికి కూడా సన్నద్ధమవుతున్నారట.
మరోవైపు కమలహాసన్ నటించిన ‘తూంగవనం’ చిత్రం మొదటి రోజునుంచే మంచి పేరు తెచ్చుకుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌కు చెందిన ఈ చిత్రం మొదటి సీన్ నుంచీ చివరి వరకు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుందని చెబుతున్నారు. తమిళనాడులో మొదటి రోజే రు.4 కోట్లు వసూలు చేసింది. త్రిష, ప్రకాష్ రాజ్,కిషోర్ ముఖ్యపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘చీకటి రాజ్యం’గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘స్లీప్‌లెస్ నైట్’ అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా దీనిని రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో కమల్ సొంతంగా నిర్మించగా, ఆయనకు గతంలో అసిస్టెంట్‌గా పనిచేసిన రాజేష్ దర్శకత్వం వహించారు.
కమల్, ఆయన కుమార్తె శ్రుతి హాసన్ నటించిన చిత్రాలు రెండూ ఒకే రోజు రిలీజ్ కావటం, రెండూ హిట్ టాక్ తెచ్చుకోవాటం ఒక విశేషంగా చెప్పుకోవాలి.