వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై తన పోరాటాలను ముగించేసినట్లే ఉన్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకు ఉద్యమిస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన జగన్, వైకాపా నేతలు వారి మీడియా ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదిప్పుడు. గత కొన్ని రోజులుగా స్తబ్దంగా ఉండిపోయిన వైకాపా నేతలు మళ్ళీ అటువంటి బలమయిన సమస్య గురించి వెదుకుతుంటే, వారికి విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ తెదేపా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జి.ఓ.నెంబర్: 97 ఒక గొప్ప వరంగా అందివచ్చింది. పాడేరు వైకాపా ఎమ్మెల్యే ఈశ్వరి తక్షణమే ఆ ప్రాంతంలో పర్యటించి, ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోయినట్లయితే వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించేరు. త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖ మన్యంలో పర్యటించి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేయడానికి సిద్దం అవుతున్నారు. అంటే మరో కొత్త యుద్దానికి వైకాపా రంగం సిద్దం చేసుకొన్నట్లే భావించాలి.
సరిగ్గా ఇటువంటి సమయంలోనే హటాత్తుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రంగప్రవేశం చేసారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అంటే ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలపై తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవచ్చును లేదా పూర్తిగా ఉపసంహరించుకొనే అవకాశం ఉందని భావించవచ్చును. మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ “ఈనెల 16న జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై జారీ చేసిన జి.ఓ.పై మళ్ళీ చర్చ జరుపుతామని, గిరిజనులకు ఇబ్బంది కలిగించాలని తమ ప్రభుత్వం భావించడం లేదని, వారు అంగీకరించకపోతే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి కూడా సిద్దమే”నని అన్నారు. కనుక మంత్రివర్గ సమావేశం అనంతరం “పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు” విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించవచ్చును.
ప్రత్యేక హోదా అంశం తరువాత బాక్సైట్ తవ్వకాలపై పోరాడుదామని జగన్మోహన్ రెడ్డి సిద్దపడుతుంటే ఆ విషయం పసిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాక్సైట్ తవ్వకాలను అడ్డుకొన్న క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి కి దక్కకూడదనే ఉద్దేశ్యంతోనే హటాత్తుగా పవన్ కళ్యాణ్ న్ని రంగంలోకి దించినట్లుంది. ఇక జగన్ ఈ అంశంపై పోరాడలేడు. ఒకవేళ పోరాడిన ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి కాదు. ఇంతకు ముందు రాజధాని భూసేకరణ సమయంలో జగన్ పోరాటాలకి సిద్దం అయినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హటాత్తుగా రంగ ప్రవేశం చేయడం, ఆనక “పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు” భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెదేపా ప్రభుత్వం ప్రకటించడం గమనిస్తే, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ న్ని రంగంలో దించినట్లు అనుమానం కలుగుతోంది. మరి ఈ అనుమానం నిజమో కాదో బాక్సైట్ తవ్వకాలపై మంత్రివర్గం తీసుకొనే నిర్ణయాన్ని బట్టి తెలుస్తుంది.