చరిత్ర పుటల్లో మాత్రమే కనబడే ‘టిపు సుల్తాన్’ ప్రశాంతంగా ఉన్న కర్నాటక రాష్ట్రంలో చిచ్చు రగల్చడం చాలా విచిత్రమే. కానీ అందుకు ఆయన్ని తప్పు పట్టలేము. ఆయన పేరిట చిచ్చు రగిలించింది కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ అగ్నికి ఆజ్యం పోసి పెంచుతున్నది బీజేపీ అనుబంధ సంస్థలే. త్వరలో జరుగబోయే తాలుక, జిల్లా,పంచాయితీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో మైనార్టీలను ఆకర్షించేందుకే కర్నాటక ప్రభుత్వం చరిత్ర పుటల్లోంచి ‘టిపు సుల్తాన్’ న్ని వెతికి పట్టుకువచ్చింది. ఆయన జయంతి ఉత్సవాలను జరపాలని నిర్ణయించింది. ఇంతకు ముందు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ఇటువంటి ఆలోచనలే చేసి లబ్ది పొందింది. దాని అడుగు జాడలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడిచి లబ్ది పొందాలనుకొంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ‘హిందుత్వం’ కానిదేనినయినా వ్యతిరేకించాలనే గుడ్డి ఆలోచనతోనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫలితంగా ఘర్షణలు, పోలీసుల లాఠీ చార్జిలు,కాల్పులు, వాటిలో అనేకమందికి గాయాలు, ఒకరు మృతి చెందడం జరిగాయి.
ఇటువంటి ఒక చిన్న అంశం పట్టుకొని ప్రభుత్వం రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించడం ఎంత తప్పో అర్ధంపర్ధం లేని ఒక చిన్న అంశం పట్టుకొని హిందూ సంస్థలు రాద్దాంతం చేయడం కూడా అంతే పొరపాటు. ఇటువంటి సంఘటనలను భారత్ అంతర్గత సమస్యగా చెప్పుకొంటున్నప్పటికీ, వాటి వలన అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మసకబారుతుంది. పాకిస్తాన్ దేశంలో ఏవిధంగా మత ఛాందసవాదం ప్రభుత్వాలనే ప్రభావితం చేస్తోందో, భారత్ లో కూడా అదే విధంగా ఈ హిందూ మతోన్మాదం క్రమంగా పెరుగుతూ ప్రభుత్వాలపై ప్రభావం చూపుతోందనే అపప్రధ భారత్ కి కలిగే అవకాశం ఉంది.
రాజకీయపార్టీలు ఆడుకొంటున్న ఈ ‘మత జూదం’ వలన దేశానికే తీరని అప్రదిష్ట కలుగుతోంది. ప్రజలకు భద్రత కల్పించి వారికి మార్గదర్శనం చేయవలసిన ప్రభుత్వాలు, వాటిని నడుపుతున్న రాజకీయ పార్టీలే ఈవిధంగా వ్యవహరిస్తుండటం చాలా శోచనీయం. కర్ణాటకలో ప్రస్తుతం జరుగుతున్న ‘టిపు సుల్తాన్’ యుద్ధం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆధిపత్యపోరు తప్ప మరొకటి కాదు. కానీ అందులో ఎవరూ నెగ్గే అవకాశం లేదని అవి గ్రహించడం లేదు. బీజేపీని కాదని అధికారం కట్టబెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడలేకపోయిందని ప్రజలు భావిస్తే అసహజమేమీ లేదు. అలాగే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక దేశంలో మత అసహనం, రచయితలపై దాడులు పెరిగిపోతున్నయనే వాదనకు ఈ సంఘటనలన్నీ బలం చేకూర్చేవిగా ఉన్నాయి కనుక బీజేపీకూడా నష్టపోక తప్పదు. కనుక కాంగ్రెస్, బీజేపీలు తక్షణమే ఈ వికృత క్రీడను నిలిపివేయడం మంచిది. లేకుంటే బిహార్ ఫలితాలు పునరావృతం అవుతాయి.