హైదరాబాద్: కథ పాతదైనా కొత్త ట్రీట్మెంట్తో సినిమా తీస్తే – పాత సారాను కొత్త సీసాలో పెట్టి ప్యాక్ చేశారని అనటం జరుగుతూ ఉంటుంది. దాదాపు 70 ఏళ్ళ నాటి రాజశ్రీ సంస్థ సల్మాన్ ఖాన్‌తో 16 ఏళ్ళ విరామం తర్వాత రూపొందించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రం పాత సీసాలో పాతబడిపోయిన సారాలాగా ఉంది. దాదాపు 125 ఏళ్ళ క్రితం నాటి ప్రముఖ అమెరికన్ రచయిత మార్క్‌ట్వేన్ రచించిన ‘ది ప్రిన్స్ అండ్ పాపర్’ కథే ఈ సినిమాకు ఆధారం. ఆ కథ ఆధారంగా ఈ 125 ఏళ్ళలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో వందల సినిమాలు వచ్చాయి. తెలుగులో కూడా నాటి ఎన్టీఆర్ ‘రాజూ-పేద’ దగ్గరనుంచి చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ వరకు అనేక సినిమాలు రూపొందిన సంగతి తెలిసిందే.
బంపర్ హిట్ ‘బజరంగీ భాయిజాన్’ తర్వాత వస్తున్న సల్మాన్ చిత్రం కావటంతో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు సల్మాన్-సూరజ్ బర్జాత్యా సూపర్ హిట్ కాంబినేషన్ కావటం ఆ అంచనాలను రెట్టింపు చేసింది. చిత్రంలో సల్మాన్ ఖాన్ యువరాజ్ విజయ్ సింగ్, ప్రేమ్ దిల్వాలా అనే రెండు పాత్రలను పోషించారు. హీరోయిన్గా నటించిన సోనమ్ కపూర్ అతనికి కూతురులాగా కనిపించటం ఒక పెద్ద మైనస్ పాయింట్ అయింది. కథలోగానీ, కథనంలోగానీ కొత్తదనం లేకపోవటం, రాజశ్రీ చిత్రాలలో ప్రధానమైన ఆకర్షణగా నిలిచే పాటలు ఈ చిత్రంలో ఆకట్టుకునేవిధంగా లేకపోవటం, సన్నివేశాలన్నీ 80వ దశకంనాటివి లాగా అనిపించటం సినిమాను దెబ్బతీశాయి. రాజశ్రీ చిత్రాలన్నింటికీ రామ్ లక్ష్మణ్ సంగీతాన్ని అందించగా, వారు పెద్దవారయిపోవటంతో సల్మాన్ సూచన మేరకు సూరజ్ బర్జాత్యా ఈ సినిమాకు హిమేష్ రేషమ్మియాను తీసుకున్నారు. టైటిల్ సాంగ్ తప్పితే మిగిలిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే దీపావళి పండగ సీజన్ కాబట్టి ఓపెనింగ్స్ బాగున్నాయి. మొదటిరోజే రు.40.35 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అయితే షారుఖ్ హ్యాపీ న్యూ ఇయర్ చిత్రం నెలకొల్పిన ఓపెనింగ్స్ రికార్డ్(రు.44.87 కోట్లు) క్రాస్ చేయలేకపోయింది. మరోవైపు ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమలీల’ పేరుతో రిలీజ్ అయింది. సల్మాన్ పాత్రకు రాంచరణ్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.