హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నికకోసం సర్వశక్తులూ ఒడ్డి కృషి చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు ఝలక్ ఇచ్చారు. కేసీఆర్ పాలన బాగుందని, భేష్ అని మెచ్చుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెస్సార్, టీఆర్ఎస్ పరిపాలన బాగుందని, మిషన్ కాకతీయ, గ్రామ జ్యోతి పథకాలన్నీ ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించటమేగానీ, కేసీఆర్ పాలన అంతా సజావుగా సాగిపోతోందని అన్నారు. కేసీఆర్ దూకుడుగా వెళ్తే ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. ఆయన ప్రతిపక్షాలను కలుపుకుపోవాలని సూచించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టటానికి రాహుల్ మరికొంత కాలం ఆగాలని అన్నారు. ఎమ్మెస్సార్ వ్యాఖ్యలతో దిమ్మ తిరిగిన కాంగ్రెస్ నేతలు, ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుని కూర్చున్నారు. అసలే రాజయ్య పరిణామంతో దెబ్బతిని ఉండగా, ఎమ్మెస్సార్ ఇలా వ్యాఖ్యలు చేయటం వారిని నిశ్చేష్ఠులను చేసింది.
ఎమ్మెస్సార్ మొదటినుంచీ సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరన్నది తెలిసిందే. ఇలా వ్యాఖ్యలు చేస్తుంటేనే వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి పదవినుంచి తప్పించి ఆర్టీసీ ఛైర్మన్ పోస్ట్‌లో కూర్చోబెట్టారు. ఒక సమయంలో ఎమ్మెస్సార్ వ్యాఖ్యల వలనే కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక కూడా వచ్చిన సందర్భంకూడా ఉంది. యూపీఏ-2 హయాంలో పార్టీ నాయకత్వం నుంచి గవర్నర్ పదవి ఆశించి భంగపడ్డారు. ఎమ్మెస్సార్, కేసీఆర్ ఒకే సామాజికవర్గం(వెలమ) కావటం విశేషం.