చాలా కాలంగా మీడియా ముందుకు రాని సీనియర్ కాంగ్రెస్ నేత ఎం.సత్యనారాయణ రావు సరిగ్గా వరంగల్ ఉప ఎన్నికల సమయంలో మీడియా ముందుకు వచ్చి తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని మెచ్చుకోవడంతో కాంగ్రెస్ నేతలు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. “వృదాప్యం కారణంగా ఆయన రాజకీయాల నుండి రిటైర్ అయ్యి చాలా కాలం అయ్యింది కనుక ఆయనకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడల గురించి కానీ తెలిసి ఉండదు. అందుకే అలాగా మాట్లాడిఉంటారు. ఆయనిప్పుడు రాజకీయాలలో పాల్గొనడం లేదు కనుక ఆయన మాటలను పట్టించుకొనవసరం లేదు. అలాగే ఆయనపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు చేప్పట్టనవసరం లేదని” నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేసారు.
తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ఆయన మాటలను ఖండించకపోవడం గమనిస్తే తెరాస పరిపాలన చాలా బాగుందని కాంగ్రెస్ మనసులో మాటనే సత్యనారాయణ బయటపెట్టినట్లుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అవి మురిగిపోయినట్లే. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మంత్రి కె.తారక రామారావుల మధ్య తెరాస ప్రభుత్వం చేప్పట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో రహస్య ఒప్పందం జరిగిందని అందుకే వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా తన అభ్యర్ధిని నిలబెట్టిందని అన్నారు. జిల్లా రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే బీజేపీ అభ్యర్ధి డా. దేవయ్యకే ఓటు వేయడం మంచిది,” అని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.