హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని గుడివాడ పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. గుడివాడ వైసీపీ పార్టీ కార్యాలయం ఉన్న భవనం యజమాని సుశీల ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది. తన భవనంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయమని కొంతకాలంగా చెబుతూ వస్తున్నానని, అయితే ఆ పార్టీ నేత కొడాలి నాని పట్టించుకోవటం లేదని సుశీల ఆరోపిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆమె తన భవనానికి తాళం వేసి ధర్నాకు కూర్చున్నారు. దీంతో వైసీపీ కార్యాలయంవద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుశీల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ మోహరించారు. అక్కడికొచ్చిన నాని, తమకు చెప్పకుండా భవనానికి తాళం ఎలా వేస్తారని పోలీసులను ప్రశ్నించారు. భవన యజమాని కమ్మవారని, ఆమె చంద్రబాబు నాయుడు భార్యకు వెళ్ళి చెప్పటంతో, ఆమె పోలీసులను పంపారని, తనకంతా తెలుసని ఆరోపించారు. నానికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు నానిని అరెస్ట్ చేసి ముదినేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదిలా ఉంటే, కొడాలినానికి మిత్రుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ – పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలో కృష్ణాజిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచారు. మంత్రి కొల్లు రవీంద్ర రెండో ర్యాంక్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మూడో ర్యాంక్ దక్కించుకున్నారు. గతంలో విజయవాడలో రాష్ట్ర పార్టీ సమావేశం జరిగినపుడు ర్యాంకులు ఇచ్చినపుడు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య)కు మొదటి ర్యాంక్ వచ్చింది. అయితే ఈ సారి ఆయన తన ర్యాంక్ వెల్లడించటానికి సుముఖత చూపటంలేదు. జన్మభూమి, పేదలకు ఇళ్ళు మంజూరు వంటి పథకాల అమలు, తదితర 20 అంశాలపై చేయించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.