హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవమానించిందంటూ నమస్తే తెలంగాణ పత్రిక నిన్న ఒక కథనాన్ని ఇచ్చింది. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన విశేషాలతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక ఫోటో ఎగ్జిబిషన్లో కేసీఆర్ ముఖానికి ఏపీ ప్రభుత్వం నల్లరంగు పులిమిందని ఆరోపించింది. ఆయన ముఖం కనిపించకుండా చేసి పైశాచికత్వాన్ని ప్రదర్శించిందని మండిపడింది.
అసలు జరిగిందేమిటంటే, ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిన్న ప్రారంభమైన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్వారి ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో రాజధాని అమరావతి విశేషాలను ప్రజలకు తెలియచెప్పటంకోసం ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విజయదశమి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడి చేతులుమీదగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి నాలుగు ఫోటోలను ఆ ఫోటో ఎగ్జిబిషన్లో పెట్టారు. ఆ నాలుగు ఫోటోలలో కేసీఆర్ ముఖానికి నలుపు రంగు పులిమి ఉంది. అది ప్రభుత్వమే చేయించందని నమస్తే తెలంగాణ ఆరోపణ.
ఎగ్జిబిషన్ ప్రారంభమవటానికి ముందు రోజు తీసిన ఫోటోలను నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించారు. ఎగ్జిబిషన్ ప్రారంభమైన తర్వాత ఎలా ఉందో రాయలేదు. ఇదిలా ఉంచితే, ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలకు నలుపురంగు పులమటాన్ని బుద్ధి, జ్ఞానం, విచక్షణ ఉన్న వారెవరూ ఆమోదించరు. ఎవరో కింది స్థాయి ఉద్యోగో, మరెవరైనా తుంటరో చేసినదానికి, దానిని ఏపీ ప్రభుత్వం మొత్తానికీ ఆపాదించి ద్వేషం వెళ్ళగక్కటం ఒక బాధ్యతాయుతమైన దినపత్రిక చేసే పని కాదు.