కొన్ని రోజుల క్రితం నేపాల్ ప్రధానిగా ఎన్నికయిన ఖడ్గ ప్రసాద్ ఓలి అప్పుడే భారత్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్, చైనా దేశాల మధ్య 1954లో యుద్ధం ముగిసిన తరువాత ఇరుగు పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు పంచ్శీల్ సూత్రాల ఒడంబడిక జరిగిందని, కానీ భారత్ దానిని పెద్దగా పట్టించుకోకుండా నేపాల్ పై అనధికార దిగ్బంధాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఆనాడు యుద్ద సమయంలో తమ దేశం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల కంటే భారత్ అమలు చేస్తున్న ఈ అనధికార దిగ్బందం కారణంగానే ఎక్కువ ఇబ్బంది పడుతోందని అన్నారు. కనుక తమ దేశ సమగ్రత, దేశ సార్వభౌమత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తూ భారత్ తక్షణమే అనధికార దిగ్బంధాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన భారత్ కి విజ్ఞప్తి చేసారు. భారత్ నుండి నేపాల్ కి నిత్యం బియ్యం, గోదుమలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, అనేక రకాల మందులు ఎగుమతి అవుతుంటాయి. అనేక దశాబ్దాలుగా భారత్ నేపాల్ కి అండగా ఉంటూ ఆ దేశంలో అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తోంది. కానీ నేపాల్ మాత్రం భారత్ పట్ల ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. భారత్ అందిస్తున్న సహాయసహకారాల కంటే, ఆ వంకతో అది తమ దేశ రాజకీయాలలో, ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్షంగా వేలుపెడుతోందని ఆరోపిస్తోంది. ఇటీవల భారత్-నేపాల్ సరిహద్దుల వద్ద నేపాల్ పోలీసులు జరిపిన కాల్పులలో ఇద్దరు భారతీయులు మరణించడంతో భారత్ కూడా నేపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బహుశః ఆ కారణంగానే తమకు నిత్యావసర సరుకులు, ముఖ్యంగా పెట్రోల్ రవాణాను తగ్గించిందని నేపాల్ ఆరోపిస్తోంది. కనుక ఈ అప్రకటిత దిగ్బంధాన్ని ఎత్తివేయాలని నేపాల్ ప్రధాని కోరుతున్నారు.