హైదరాబాద్: కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో వైసీపీ కార్యాలయ అద్దె భవనంపై వివాదం విషయంలో నిన్నటినుంచి అక్కడ నెలకొన్న ఉద్రిక్తత ఇవాళకూడా కొనసాగుతోంది. భవనానికి వేసిన తాళం పగలగొట్టైనా లోపలికెళతానని నాని నిన్న సవాల్ విసిరిన నేపథ్యంలో టీడీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, స్థానిక నాయకుడు రావి వెంకటేశ్వరరావు ఇవాళ ఉదయం తమ కార్యకర్తలతో సహా ఆ భవనం దగ్గరకు చేరుకున్నారు. అయితే 144 సెక్షన్ ఉన్నందున అక్కడనుంచి వెళ్ళిపోవాలంటూ డీఎస్పీ యార్లగడ్డ అంకినీడు వారిని బలవంతంగా అక్కడనుంచి పంపేశారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
నిన్న పోలీసులు నానిని అరెస్ట్ చేసి, అద్దెభవనాన్ని ఖాళీ చేయించి యజమానురాలు సుశీలకు అప్పగించిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై విడుదలైన నాని మీడియాతో మాట్లాడుతూ, తాను చంద్రబాబు నాయుడుకు సవాల్ విసురుతున్నానని, ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని అన్నారు. దీనికి బుద్దా వెంకన్న విజయవాడలో ప్రతిస్పందిస్తూ, చంద్రబాబుదాకా ఎందుకు, టీడీపీ కార్యర్త చాలని చెప్పారు. తాను సోమవారం గుడివాడ వచ్చి వైసీపీ కార్యాలయంముందే ప్రెస్ మీట్ పెడతానని, నాని బండారు బయటపెడతానని సవాల్ విసిరారు.