హైదరాబాద్: గుడివాడ పట్టణంలో వైసీపీ భవనం వివాదంపై నిన్న కొడాలి నానికి సవాల్ విసిరిన టీడీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఇవాళ గుడివాడ వెళ్ళారు. వివాదాస్పద భవనంవద్ద మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని ఒక సైకో అని, ఐరన్ లెగ్ అని ఆరోపించారు. నాని 2004, 2009 సంవత్సరాలలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడని, టీడీపీ అధికారంలోకి రాలేకపోయిందని, తర్వాత జగన్ వేవ్ బాగా ఉందని జగన్ పార్టీలో చేరాడని, 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచాడని, ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని చెప్పారు. అతను గడ్డం, మీసాలు పెంచుకున్నంత మాత్రాన రౌడీ అయిపోతాడా అని ప్రశ్నించారు. నాని ఏ రోజూ గుడివాడలో ఎవరినీ చెంపదెబ్బకూడా కొట్టలేదని చెప్పారు.(ఎవరినీ కొట్టకపోవటం మంచిదేగా!) ఇంటినుంచి బయటకు రాని ముసలమ్మపై ప్రతాపం చూపిస్తున్నాడని ఆరోపించారు. నానికి పిచ్చి ఎక్కువైపోయి పిచ్చికుక్కలాగా రోడ్డుమీద పడి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుమీద, ఆయన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. మరోవైపు రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, దమ్ముంటే నాని ఇక్కడకు రావాలంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ సవాల్ విసిరారు.