పారిస్ లో నరమేధం సృష్టించిన ఐసిస్, అక్కడితో ఆగే అవకాశం లేదట. ఐరోపా దేశాల్లో మరిన్ని దాడులకు పథకం పన్నిందని ఫ్రాన్స్ ప్రధాని హెచ్చరించారు. పారిస్ తో పాటు ఇతర ఐరోపా దేశాల్లో దాడులకు సిరియాలో పక్కా ప్లాన్ వేశారని ఆయన తనకు లభించిన సమాచారాన్ని తెలిపారు.
ఆయన మాటలు, సిరియా జాతీయుడు పారిస్ దాడుల్లో పాల్గొన్న వాస్తవాన్ని కలిపి చూస్తే, ఐరోపాకు కచ్చితంగా ముప్పు పొంచి ఉంది. పారిస్ మ్యూజిక్ కాన్సర్ట్ హాలు వద్ద దాడులు జరిపి, తనను తాను పేల్చుకున్న ఉగ్రవాదుల్లో ఒకరి మృతదేహం వద్ద సిరియా పాస్ పోర్ట్ లభించింది. దాని ఆధారంగా గ్రీస్ అధికారులను ఆరా తీశాడు. అతడు గత నెలలో ఐసిస్ దాడుల వల్ల సిరియా సరిహద్దులు దాటి గ్రీస్ లో ఆశ్రయం పొందిన వేల మంది శరణార్థుల్లో ఒకడని తేలింది. అతడు శరణార్థిగా పేరు నమోదు చేయించుకుని ఆశ్రయం పొందాడు.
ఇటీవల సిరియా అంతర్యుద్ధం వల్ల లక్షల మంది అనేక ఐరోపా దేశాలకు పరుగులు తీశారు. భవిష్యత్తులో సమస్యలు వస్తాయని కొన్ని దేశాలు వీరిని రానివ్వలేదు. కానీ చాలా దేశాలు మానవత్వంతో ఆశ్రయం కల్పించాయి. ఇప్పుడు ఆ మానవత్వమే కొంప ముంచే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ఐరోపా దేశాల్లో శరణార్థులుగా ప్రవేశించిన లక్షల మందిలో ఐసిస్ ఉగ్రవాదులు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. అదే నిజమైతే, ఏ క్షణం ఏ దేశంలో పారిస్ తరహా మారణహోమం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
గ్రీస్ లో పెద్ద సంఖ్యలో సిరియా శరణార్థులు ఆశ్రయం పొందారు. మానవత్వంతో భోజనం పెడుతూ ఆశ్రయం కల్పించిన అలాంటి దేశాల్లోనే ఉగ్రదాడులు జరిగినా ఆశ్చర్యం లేదనే కోణంలో అక్కడి ప్రభుత్వాలను ఫ్రాన్స్ హెచ్చరించింది. జీహాద్ పేరుతో మారణహోమం సృష్టించిన వారిలో ఒక్క సిరియా జాతీయుడు తప్ప మిగతా వారంతా ఫ్రెంచి పౌరులే అని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను గుర్తించారు. వారంతా ఫ్రాన్స్ లోని వివిధ పట్టణాలకు చెందిన వారేనని తేలింది.
మరోవైపు, ఈ దాడులకు సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాన్స్ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ అరెస్టు జరిగింది. ఫ్రాన్స్ లోనూ దాదాపు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు సహకరించారనే అనుమానంతో, అతివాద ఇస్లామిక్ సంస్థలతో సంబంధాలున్నాయనే అభియోగంతో వీరిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు. దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల సమాచారాన్ని రాబడుతున్నారు. మొత్తం మీద, ఐరోపాలో ఐసిస్ మరణమృదంగం పారిస్ తో మొదలై మిగతా దేశాలనూ వణికించక ముందే ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఫ్రాన్స్ అప్పుడే 12 యుద్ధ విమానాలతో సిరియాలోని ఐసిస్ స్థావరాలపై వైమానికి దాడులు మొదలుపెట్టింది. యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.