ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయనాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పెడుతున్నట్లుగా ప్రజలను ఆకర్షించేందుకు తాము సందర్శించే ప్రదేశం, అక్కడి ప్రజలు, వారి కులమతాలు, వేష బాషలను అనుకరించడం చాలా సహజమే కానీ కల్లు గీత కార్మికులను ఆకర్షించడానికి ఎన్నికల ప్రచార సభలో ఏకంగా కల్లు తాగడం మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమే. అలాగ కల్లు తాగింది ఎవరో ఆషామాషీ వ్యక్తి కాదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్. వరంగల్ ఉప ఎన్నికలు ప్రచారంలో పాల్గొంటున్న ఆయన సోమవారం వరంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌడ కులస్తులతో సమావేశం అయ్యేరు. ఆ సందర్భంగా వారు అందించిన తాడు, మోకును మెడలో వేసుకుని, వెనుక ఉన్న గాంధీ మహాత్ముడి ఫోటో సాక్షిగా, ముందున్న కాంగ్రెస్ నేతల సాక్షిగా నాలుగు పెగ్గు కల్లు తాగి తన బోసినోటితో చిద్విలాసంగా చిర్నవ్వులు చిందించారు. తెలంగాణా ప్రభుత్వం అసమర్దత కారణంగా రాష్ట్రంలో కల్తీ కల్లు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, ఆ కారణంగా ఒకవైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే మరో వైపు స్వచ్చమయిన కల్లు సేకరించి అమ్ముకొనే గీత కార్మికులు రోడ్డున పడుతున్నారని దిగ్విజయ్ సింగ్ ఎక్కడా తడబడకుండా ముక్తాయింపు పలికారు. వారి సమస్యల సంగతి ఎలా ఉన్నప్పటికీ దిగ్గీ రాజావారు చివరికి పబ్లిక్ గానే లొట్టలేసుకొంటూ కల్లు టేస్ట్ చూసేసారని అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు.