ఒకరు అందరికీ చిరపరిచితుడయిన వైకాపా అధ్యక్షుడు జగన్ కాగా మరొకరు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్. ఇద్దరిదీ పూర్తిగా భిన్న దృవాలయినప్పటికీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇద్దరూ ఒకే రకమయిన అభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం. కేసీఆర్ మోజు పడటం వలననే వరంగల్ ఉప ఎన్నికలు వచ్చేయని జగన్మోహన్ రెడ్డి అంటే, కేసీఆర్ భూస్వామ్య అహంకారానికి పరాకాష్టకి నిదర్శనంగా ఉప ఎన్నికలు వచ్చేయని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ అభిప్రాయపడ్డారు. ఈ 16 నెలల తెరాస పాలనలో పేద ప్రజలను పట్టించుకోకుండా రాష్ట్రంలో దళారీ, భూస్వామ్యవర్గాన్ని పెంచి పోషించిందని విమర్శించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ 16 నెలల పాలనలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కోసం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాయమాటలు చెపుతూ ప్రజలకు మభ్యపెడుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తే, కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పడమే కాకుండా దళితులకు పక్కనబెట్టి, తెలంగాణా ద్రోహులకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. మావోయిష్టుల అజెండానే తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెపుతూ, మావోయిష్టులను భూటకపు ఎన్కౌంటర్ చేయిస్తున్నారని మావోయిస్ట్ నేత జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను పాటించని తెరాస ప్రభుత్వానికి ఈ ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇద్దరు జగనన్నలు కోరారు.