తిరుపతి, చిత్తూరు, చెన్నై ఇలా అనేకచోట్ల జడివానలు కురుస్తున్నాయి. పలుచోట్ల జనజీవనం స్తంభించింది. దీంతో జలగండాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశంలోని అనేకనగరాలు సిద్దంగా లేవన్నది మరోసారి తేటతెల్లమైంది. మనదేశానికి ఇదో శాపం. ఈ పరిస్థితుల్లో మనం ఏపీలో నూతన రాజధాని అమరావతి నిర్మించబోతున్నాము. మిగతా నగరాలను పట్టిపీడిస్తున్న శాపమే నూతన రాజధానికీ వెన్నంటి ఉంటుందా ? లేక జలగండం లేని నగరం ఆవిష్కృతమవుతుందా? మనల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ దిశగా నిడిపించబోతున్నారన్నది అసలు ప్రశ్న. కృష్ణానదికి చేరువనే నిర్మిస్తున్న అమరావతి విషయంలో జలగండం రాదన్న గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. `నగరమంటే, ఎత్తైన భవనాలే’- అని చంద్రబాబు అనుకుంటే భవిష్యత్తులో పెనుసవాళ్లు తప్పవు. నగర నిర్మాణ సమయంలోనే ప్రకృతి వైపరీత్యాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
జలగండంలో నగరాలు
జడివానలు పడితే నగరాలు పొంగిపొర్లుతున్న నదులను తలపిస్తున్నాయి. ముంబయి , హైదరాబాద్, కొల్ కత, చెన్నై …ఇలా ఏ నగరాన్ని తీసుకున్నా గట్టిగా పదిసెంటీమీటర్ల వానపడితేచాలు రోడ్లన్నీ జలమయం. ఇక మనతెలుగువాళ్లకు హైదరాబాద్ పరిస్థితి బాగానే తెలుసు. హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారణంగాఉంది. కుండపోతగా వర్షం పడిందంటేచాలు, కార్లు పడవల్లామారిపోతాయి. ఎక్కడ డ్రైనేజ్ మూత తెరుచుకునిఉందో తెలియక ప్రమాదాల్లో చిక్కునేవారెందరో. ఇంతటి సీరియస్ విషయంపై భాగ్యనగర వాసులు ఓ జోక్ చెప్పుకుంటూ ఉంటారు- హైదరాబాద్ కి ఎవరైనా కొత్తగా వస్తే, అప్పటికే అక్కడ ఐదేళ్ల నుంచీ ఉన్నవాడు అడుగుతుంటాడట… `నీకు ఈతవచ్చా ? లేదంటే ఇక్కడ బతకలేవ్. నాలుగు సెంటీమీటర్ల వానపడితే కొట్టుకుపోతావ్. ముందువెళ్ళి ఈతనేర్చుకో, ఆ తర్వాత హైదరాబాద్ లో బతుకుతెరువు చూసుకుందువుగానీ…’
నిజానికి ఇది జోక్ కాదు. చాలా సీరియస్ విషయం. భాగ్యనగరవాసులందరికీ ఎప్పుడోఒకప్పుడు అనుభవైక్యం. హైదరాబాద్ లోనే కాదు, ముంబయి పరిస్థితి ఇంతే. ఇప్పటికే అనేకసార్లు ముంబయి మహానగరం వరదల్లో చిక్కుకుపోయింది. ఒకసారి వచ్చిన వరదలకు బాలీవుడ్ నటుడు అమితాబ్ కలవరపడిన సంఘటన మనలో చాలామందికి గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు జడివానలు చెన్నై పనిపడుతున్నాయి. రుతుపవనాలో, ఆల్పపీడనాలో …ఏదైతేనేం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో గతకొద్దిరోజులుగా జోరుగా వానలు పడుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. ఊర్లకుఊర్లు వరద మింగేస్తోంది. పవిత్ర క్షేత్రం తిరుమలలో కుంభవృష్టి పడుతోంది. భక్తుల కష్టాలకు అంతేలేదు. కాణిపాకం పక్కన బహుదానది ఉంది. అయితే అది పరవళ్లు తొక్కడం చాలాకాలం తర్వాత ఇప్పుడు కనిపిస్తోంది.
చెన్నైలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లమీద కార్లు తేలియాడుతున్నాయి. నదులు, ఏరులు, వాగులూవంకలూ పొంగిప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు నిండిపోయాయి. చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరాల పరిస్థితే ఇలా ఉంటే పల్లెల దారుణ దృశ్యాలు చెప్పనలవికాకుండాఉన్నాయి.
కుంభవృష్టి పడినప్పుడు ఊర్లకుఊర్లు మునిగిపోతున్న నేపథ్యంలో ఏపీ నూతన రాజధాని గురించి ఆలోచించాలి. కొద్దిపాటి వానకే తల్లడిల్లే నగరంగా అమరావతిని చూడకూడదు. అత్యాధునిక నగరంగా రూపొందుతుందని చంద్రబాబు అంటున్నందున ఆ నగరం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఉండాలి. అత్యద్భుతమన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పడాలి. అందుకుతగ్గట్టుగా సరైన రీతిలో భవిష్య ప్రణాళికలు రూపొందించుకోవాలి. నూతన నగర నిర్మాణంలో ఏపనైనా ప్రణాళికాబద్ధంగా చేయడానికి వీలుంటుంది. రోడ్లు, డ్రైన్లు పక్కా ప్రణాళికతో నిర్మించవచ్చు. రాబోయే అవసరాలను అంచనావేసుకుని నగరాన్ని రూపొందించాలి. ప్రస్తుతమున్న నగరాలకులేని వెసులుబాటు నూతన నగరాలకు ఉంటుంది. అయితే ఇప్పుడు కావాల్సిందల్లా చక్కటి వ్యూహం. పక్కా ప్రణాళిక. చిత్తశుద్ధి.
ఎంతటి జడివాన పడినప్పటికీ, వాననీరు ఎప్పటికప్పుడు రోడ్డు మీద ఇంకిపోయి భూమిలోపలి పొరలకు వెళ్ళిపోయేలా టెక్నాలజీ డెవలప్ అయింది. అలాగే, డ్రైనేజ్ నిర్మాణంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, అడవిలో వానపడితే అది ఎలా ప్రకృతిలో మమేకమైపోతుందో, అలాగే కాంక్రీట్ జంగిల్ లో కూడా జరిగేలా చూసుకోవాలి. గతంలో చంద్రబాబునాయుడు ఇంకుడుగుంతలను ప్రోత్సహించారు. అలాగే, ఆయన ఇప్పుడు అమరావతి నగర నిర్మాణంలో ప్రతివాననీటి చుక్కనూ భూగర్భజలరాశిలో కలిసేలా చూడాలి. భూగర్భజలం బాగా తగ్గిపోవడంతో హైదరాబాద్ వంటి నగరాల్లో ఏడాదిపొడవునా నీటి ఇబ్బందులు తప్పడంలేదు. వేలఆడుగులలోతుకు బోర్లు వేసినా నీటిచుక్క బయటకు ఎగజిమ్మే పరిస్థితి కనబడటంలేదు. తగినంత జలరాశిలేకపోతే ఎంతఎత్తైన భవంతులు నిర్మించినా అవి జనవాసయోగ్యంకావు.
నదులకు కరకట్టలు బలోపేతం చేయడం, జనవాసాల దగ్గర సురక్షిత గోడలు కట్టించడం, రోడ్లు, వంతెనలను ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో నిర్మించడం, నగరంలోనూ, దాని చుట్టుపక్కలా డ్రైనేజ్ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటుచేసుకోవడం చాలా ముఖ్యమైన పనులు. ఇలాంటివి నూతన నగరాలను నిర్మించేటప్పుడు గుర్తుంచుకోవాలి. రాజధాని అమరావతి కృష్ణానది పక్కనే ఉంది. అయితే రాజధాని నిర్మించే ప్రాంతం వరదలకు తట్టుకునేస్థితిలోనే ఉన్నదంటూ అధికారులు విమర్శకుల నోర్లు మూయిస్తున్నప్పటికీ, వాస్తవపరిస్థితిపై భయం వీడటంలేదు. కుంభవృష్టి, వరదలను తట్టుకునేరీతిలో అమరావతి ఉండాలని కోరుకోవడం అత్యాశకాదు.
రాబోయేది గడ్డుకాలమే
ప్రపంచ వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. గ్లోబల్ వార్మింగ్, మానవతప్పిదాల కారణంగా వాతావరణంలో అతిధోరణి కనబడుతోంది. విపరీతమైన ఎండలు, కాదంటే అత్యల్పస్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఈ రెండూ కాకుంటే ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో కుండబోత. వర్షం పడటం మొదలైతే ఈమధ్య చాలాచోట్ల 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లకుపైనే వానలు పడుతున్నాయి. దీంతో ఊర్లకుఊర్లు మునిగిపోతున్నాయి. కొన్ని ఊర్లకు బాహ్యసంబంధాలు తెగిపోతున్నాయి. పరిస్థితి చక్కదిద్దడమన్నది ప్రభుత్వాలకు పెనుసవాల్ గా మారుతోంది. మానవతప్పిదాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునిఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేదికాదు. కాలవలు, కుంటలు, చెరువులు…అన్ని చోట్ల అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. జనవాసాలతో కొండలు, అడవులు కరిగిపోతున్నాయి. చెరువులు, కుంటలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఇలాంటి పరిస్థితి కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఈ పరిస్థితి కొత్త రాజధాని అమరావతికి రాకూడదు. కృష్ణానది వరదనీటి వల్లకానీ, లేదా చెరువులు, కాలవల వల్లగానీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా కట్టుదిట్టమైన వ్యూహం అమలుచేయాలి. ఆధునిక నగరాన్ని నిర్మిస్తూనే మరోవైపున ప్రకృతివైపరీత్యాలను తట్టుకునేలా చూడాలి. ఐదు సెంటీమీటర్ల వానకే జనజీవనం స్తంబించే పరిస్థితి అక్కడ రాకూడదు. రియల్ ఎస్టేట్ అన్నది నగరవాసులకు చక్కటి ఆవాసాలు అందించాలేకానీ, చెరువులు, కుంటలు, కొండలన్ని మాయంచేయకూడదు. మిగతా నగరాలను ఇబ్బందులపాలుచేసిన మానవతప్పిదాలు అమరావతిలో దరిచేరకుండా చూడాలి. పర్యావరణానికి ఎలాంటి నష్టం కలిగించకూడదు. ఈ విషయంలో అమరావతికి ఉన్న ముందుచూపు ఏమిటో చంద్రబాబు ప్రజలకు తెలియజెప్పాలి.
ఇవ్వాళ చెన్నై, తిరుపతి వంటివి కావచ్చు, రేపు మరికొన్ని ఊర్లుకావచ్చు. కుంభవృష్టి వల్ల నగరాలు, పట్టణాలకు ఏర్పడుతున్న ఇక్కట్లు నూతన రాజధానిలో తలెత్తకూడదు ఈ చేదు పాఠాల నుంచి అమరావతి ఎంతైనా నేర్చుకోవాలి. అంతేకాదు, ప్రపంచంలోనే రాబోయే నూతన నగరాలకు అమరావతి ఒక ఆదర్శ నగరంగా నిలవాలి. అలా జరగాలంటే ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా చంద్రబాబు తన కలల నగరాన్ని రూపొందించాలి. అలా జరుగుతుందన్న భరోసా చంద్రబాబు ఇవ్వడంతోబాటు ఆచరణలో చేసిచూపించాలి. అప్పుడే `శహభాష్..బాబు’ అని ప్రజలచేత అనిపించుకుంటారు.
– కణ్వస