హైదరాబాద్: ఆయన నిన్నటిదాకా కూకట్‌పల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఎందరో నేరస్తులను పట్టుకుని ఊచలు లెక్క పెట్టించారు. అయితే ఇవాళ ఆయనే ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఎదురయింది. సంచలనం సృష్టిస్తున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూకట్‌పల్లి ఏసీపీ సంజీవరావు చర్లపల్లి సెంట్రల్ జైలులో ఖైదీ నం. 7503 గా బందీ అయిఉన్నారు.
సంజీవరావుపై ఏసీబీ జరిపిన దాడుల్లో అతని ఆస్తుల చిట్టా బహిర్గతమయింది. ఇప్పటివరకు రు.13 కోట్లు ఆస్తులను గుర్తించారు. ఆయన పేరుమీద 18 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు బయటపడింది. ఇంట్లో లెక్కకు మించిన నగదు, నగలు కాకుండా 36 విదేశీ మద్యం సీసాలు కూడా దొరికాయి. ఇవికాక నల్గొండజిల్లా తిమ్మాపురంలో సంజీవరావుకు సుమారు 40 ఎకరాల భూమి ఉన్నట్లుకూడా గుర్తించారు. మరికొన్ని బ్యాంక్ లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంది. వరకట్నం మరణం కేసును మాఫీ చేయటానికి రు.10 లక్షలు, ఎస్‌సీ-ఎస్‌టీ ఎట్రాసిటీ కేసు మాఫీ చేయటానికి రు.1 లక్ష వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక స్థిరాస్తి కేసుల పరిష్కారంలో అయితే, ఆస్తి విలువలో పర్సంటేజ్ తీసుకుంటారట. ఈయన తండ్రి ఒక స్వాతంత్ర్య సమర యోధుడవటం మరో విశేషం. మరోవైపు సంజీవరావును అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరచగా, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీనితో చర్లపల్లి కారాగారానికి తరలించారు.
ఇదిలా ఉంటే, సంజీవరావు కొన్నిరోజులక్రితం ఓ కళాశాల ఫంక్షన్‌లో విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతోంది. ఆ ఫంక్షన్‌లో ఆయన – “ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చేసి, ముఖ్యమంత్రులై, అవినీతి కూపాల్లో ఇరుక్కు పోయి, కుంభకోణాల్లో కూరుకుపోయి చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్ళలో పడినవారు జాతికి ముద్దుబిడ్డలు కాదు దుష్టశక్తులు” అన్నారు. అవినీతిపై ఇంతలా డైలాగులు చెప్పిన ఆయన ఇప్పుడు అదే చర్లపల్లి జైలులో పడటంతో ఇది చర్చనీయాంశంగా మారింది.