హైదరాబాద్: ఏ.ఎం.రత్నం ఒకప్పుడు విజయశాంతికి మేకప్ మ్యాన్. తర్వాత నిర్మాతగా మారారు. సూర్యా మూవీస్ బేనర్లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తీశారు. కర్తవ్యం, పెద్దరికం, ఇండియన్(తెలుగులో భారతీయుడు), నట్పుక్కాగ(తెలుగులో స్నేహంకోసం), ముదలవన్(తెలుగులో ఒకే ఒక్కడు), కాదలర్ దినం(తెలుగులో ప్రేమికులరోజు), కుషీ(తెలుగులో ఖుషీ), రన్, ధూల్, గిల్లి, 7జి బృందావన్ కాలనీ, శివకాశి, బంగారం వంటి ఎన్నో హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే కొన్ని చిత్రాలు ఫ్లాప్ కావటంతో 2008లో చలనచిత్ర నిర్మాణం ఆపేశారు. మరోవైపు ఇద్దరు కొడుకులలో ఒకరు హీరోగా, మరొకరు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినా పెద్ద విజయాలేమీ దక్కలేదు. వారిని నిలబెట్టటంకోసం కొంత నష్టపోయారు.
ఐదేళ్ళపాటు చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న రత్నం, 2013లో తమిళ హీరో అజిత్ అండతో ఆరంబం అనే చిత్రాన్ని ఆయన హీరోగా నిర్మించారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత అజిత్‌తోనే ఎన్నై అరిందాల్ అనే చిత్రాన్ని నిర్మించారు. అది కూడా హిట్ అయింది. తర్వాత మళ్ళీ అజిత్ తోనే వేదాళం అనే చిత్రాన్ని శివ దర్శకత్వంలో నిర్మించారు. మొన్న దీపావళికి రిలీజ్ అయిన ఆ చిత్రం మొదటివారంలోనే రు.50 కోట్లు వసూలు చేసి విజయపథంలో దూసుకుపోతోంది. తమిళంలో ఇంతకుముందు మొదటి వారం రు.50 కోట్లు వసూలు చేసిన చిత్రం రోబో ఒక్కటే. దీంతో రత్నం ఇప్పుడు టాప్ రేంజ్‌లోకి వెళ్ళిపోయారు. రీజనబుల్ రేట్లకు అమ్మటంతో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బు మొదటివారంలోనే వచ్చేసింది. జోరున వర్షాలు కురుస్తున్నా కలెక్షన్స్ దుమ్ము దులుపుతున్నాయి.