“భారత్-పాక్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనకి ప్రధాన కారకుడు ప్రధాని నరేంద్ర మోడియే. ఆయనని అధికారంలో నుండి తొలగించే వరకు ఇరు దేశాల మధ్య మళ్ళీ చర్చలు జరిగే అవకాశం లేదు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే అవకాశం అంతకంటే లేదు. మోడీని అధికారం నుండి తొలగించగల శక్తి మాకుంది. కానీ అంతవరకు పాకిస్తాన్ కొంత ఓపిక పట్టాలి,” అని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మంగళవారం పాకిస్థాన్‌కు చెందిన దునియా టీవీ చానెల్ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో అన్నారు.
అధికారం కోసం రాజకీయ పార్టీలు ఎంతగా పోరాడుకొన్నా, ఒకదానినొకటి ఎంతగా విమర్శించుకొన్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ విదేశీ న్యూస్ ఛానల్..అందునా భారత్ ని శత్రుదేశంగా భావిస్తున్న పాకిస్తాన్ కు చెందిన ఒక న్యూస్ ఛానల్ తో ఈవిధంగా అనాలోచితంగా మాట్లాడటం వలన భారత్ పట్ల పాకిస్తాన్ ప్రజలలో ఏర్పడిన అపోహలు, అనుమానాలు నిజమని దృవీకరిస్తున్నట్లు అవుతుంది. ఒకవైపు భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలతో తన సంబంధాలను మరింత పటిష్టం చేసుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, మణిశంకర్ అయ్యర్ వంటి రాజకీయ నేతలు మాట్లాడుతున్న ఇటువంటి మాటల వలన భారత ప్రధాని నరేంద్ర మోడి కారణంగానే భారత్-పాక్ దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిందని చాటుకొన్నట్లు అవుతుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ కి వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, మణిశంకర్ అయ్యర్ చెప్పిన ఈ మాటలను హైలైట్ చేసి చూపితే ఏమవుతుందో ఊహించవచ్చును. మణిశంకర్ అయ్యర్ తనను తాను ఒక కాంగ్రెస్ నేతగా, రాజకీయ నాయకుడిగా మాత్రమే భావిస్తున్నట్లు మాట్లాడారు తప్ప ఒక భారతీయుడిలా మాట్లాడలేదని చెప్పక తప్పదు.