హైదరాబాద్: నిన్న వరంగల్ సభలో తనపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నిరాహార దీక్ష ఎలా చేశారో అందరికీ తెలుసన్నారు. ఆయన దీక్షలో గుట్టును త్వరలోనే విప్పుతానని చెప్పారు. రెండో రోజుకే దీక్ష విరమించాడని, ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు, ప్రజా సంఘాల ఒత్తిడి మేరకే కేసీఆర్ తిరిగి దీక్షను కొనసాగించారని గుర్తు చేశారు. కేసీఆర్ నిబద్ధత ఆనాడే తెలిసిపోయిందని చెప్పారు. ఇవన్నీ తెలిసినాకూడా, కేసీఆర్ మర్యాద పోగొడితే తెలంగాణ ఉద్యమం బలహీనపడుతుందనే సదుద్దేశ్యంతో కేసీఆర్‌ను నాడు తాము వివరణ అడగలేదని, బయటకు చెప్పలేదని వ్యాఖ్యానించారు. అంతా ఆయన ఘనతే అనుంటున్నాడని విమర్శించారు. నిమ్స్‌లో కేసీఆర్ నిరాహారదీక్ష ఎలా సాగించాడో తర్వాత బయటపెడతానని చెప్పారు. కేసీఆర్ 2011 నవంబర్ 30వ తేదీన ఖమ్మంలో రెండో రోజే నిరాహార దీక్ష విరమిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను జైపాల్ రెడ్డి మీడియాముందు ప్రదర్శించారు.
తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిఉంటే తెలంగాణ వచ్చేది కాదని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కూడా వచ్చేది కాదని, హైదరాబాద్ రెవెన్యూతో కూడిన తెలంగాణ కూడా వచ్చేది కాదని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఉమ్మడిరాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తెలంగాణ రాష్ట్ర సాధనకోసమే తాను ఆ పదవి తీసుకోలేదని చెప్పారు. కేసీఆర్ దివాళాకోరుతనంవల్లే రాష్ట్రం లోటుబడ్జెట్‌లోకి వెళ్ళిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తప్పుడు వాగ్దానాల వలనే గెలిచిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత ఉందో ప్రజలకు తెలుసని అన్నారు. కేసీఆర్ తనవల్లే వచ్చిందని అనుకోవటం సబబు కాదని చెప్పారు. తాను కేంద్ర క్యాబినెట్ లో ఉండబట్టే తెలంగాణ వచ్చిందని అన్నారు. నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తులను, కేంద్ర క్యాబినెట్లో ఉన్న నలుగురు సీమాంధ్ర మంత్రులను తాను ఎదుర్కొని అడ్డుకున్నానని చెప్పారు. కొన్నిసార్లు అధిష్టానంతోకూడా తలపడ్డానని అన్నారు. కేసీఆర్ నిన్నటి సభలో మాట్లాడుతూ, తాను గతంలో జాతీయవాదినని చెప్పిన విషయాన్ని పేర్కొన్నారని, తాను అప్పుడూ జాతీయవాదినే, ఇప్పుడూ జాతీయవాదినేనని జైపాల్ అన్నారు.
జైపాల్ రెడ్డి మాటలలో నిజం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు ముందు ఢిల్లీలో నడిచిన వ్యవహారాలలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ ఆ కీలక నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేసిన నేతలలో ఆయన ముఖ్యుడని చెప్పాలి. ఒక దశలో ఆయనను ముఖ్యమంత్రిని చేద్దామని కాంగ్రెస్ అధిష్టానం భావించింది కూడా నిజమే. ఆయన పాత్రను కేసీఆర్ తేలిగ్గా తీసేయటం సమంజసం కాదు. అయితే కేసీఆర్ పరువునుకూడా జైపాల్ రెడ్డి ఇవాళ బాగానే తీశారు… ఖమ్మం ఆసుపత్రిలో నాడు తీసిన వీడియో ద్వారా. బయటవారందరినీ పంపించి కేవలం కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో కేసీఆర్ నిమ్మరసం తాగటం ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. నిమ్స్‌లో కేసీఆర్ నిరాహారదీక్ష చేసిన వైనాన్నికూడా త్వరలోనే బయటపెడతానని జైపాల్ అంటున్నారు. మరి దానిని వరంగల్ ఉపఎన్నికలోపు బయటపెడతారో, లేదో చూడాలి.