మాజీ కాంగ్రెస్ ఎంపి సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవీలత బెయిలు కోసం పెట్టుకొన్న పిటిషన్ న్ని వరంగల్ లోని రెండో అధనపు మేజిస్ట్రేట్ కోర్టు నేడు తిరస్కరించింది. వారి కుమారుడు అనిల్ ని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. కొన్ని రోజుల క్రితం రాజయ్య ఇంట్లో తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు అనుమానాస్పద స్థితిలో సజీవ దహనం అవడంతో రాజయ్య కుటుంబ సభ్యులను పోలీసు అరెస్ట్ చేసారు. ఆ కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకే పోలీసులు రాజయ్య కొడుకు అనిల్ ని రెండు రోజుల కోసం కస్టడీ కోరుతూ వేసిన పిటిషన్ న్ని కోర్టు నేడు ఆమోదించింది. సారిక ఆత్మహత్య చేసుకొందని ఫోరెన్సిక్ నివేదికలో దృవీకరించారు. కానీ పోలీసులు కోర్టుకి సమర్పించిన ప్రాధమిక దర్యాప్తు నివేదికలో రాజయ్య, అతని భార్య మాధవీలత, వారి కుమారుడు అనిల్ ముగ్గురూ సారికని హింసిస్తూ, ఆమెను ఆత్మహత్య చేసుకోమని నిత్యం పురికొల్పేవారని తెలిపారు. ఆ కారణంగానే ఆమె జీవితంపై విరక్తి చెంది తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని తెలిపారు. కనుక వారు ముగ్గురు ఆమెను, పిల్లలను హత్య చేయకపోయినా ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన్నందుకు చట్ట ప్రకారం శిక్షలు ఎదుర్కోక తప్పకపోవచ్చును.