హైదరాబాద్: చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న మూడు ముఠాలను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఫరూక్, ఇరానీ అనే ముఠాలకు చెందిన నలుగురు సభ్యులనుంచి కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు 46 స్నాచింగ్ కేసుల్లో నిందితులని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. వీరు కాకుండా బోరబండకు చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి ఒక్కడే 19 స్నాచింగ్‌లకు పాల్పడినట్లు వెల్లడించారు. వీరంతా కొంతకాలంగా సిటీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారని తెలిపారు. మరోవైపు నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మోహన్ అనే వ్యక్తికికూడా ఈ ముఠాలతో సంబంధం ఉందని కనుగొని పోలీసులు షాక్ తిన్నారు. ఫరూక్‌తో కలిసి మోహన్ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అతనిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాల సభ్యులు మల్కాజ్ గిరి, కూకట్‌పల్లి పరిధిలో ప్రధానంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతారని ఆనంద్ చెప్పారు. చైన్ స్నాచింగ్ నేరాల నియంత్రణ కోసం పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చైన్ స్నాచర్లనుంచి బంగారాన్ని కొనే వ్యాపారులు, ఎన్‌బీఎఫ్‌సీలపై కూడా చర్యలు తీసుకుంటామని ఆనంద్ చెప్పారు.