హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో వివిధ పార్టీల నాయకుల పరస్పర విమర్శనాస్త్రాల నేపథ్యంలో తెలంగాణ ఎవరు తెచ్చారన్న చర్చ మళ్ళీ మొదలయింది. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణను తెచ్చారని టీఆర్ఎస్ నేతలంటుంటే, తాను క్యాబినెట్లో లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పారు. మరి అసలు తెలంగాణ సాధించిన ఘనత ఎవరికి దక్కాలి!
ఈ చర్చకు తెరలేపింది కేసీఆరేనని చెప్పాలి. మంగళవారం వరంగల్ ఉపఎన్నిక బహిరంగ సభలో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు జైపాల్ రెడ్డి ఏడ పండుకున్నడో తెల్వదా అని అన్నారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో మంత్రి పదవిని అనుభవిస్తూ తాను జాతీయవాదినని, ప్రాంతీయవాదిని కానని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇట్ల అబధ్ధాలు, అసత్య ప్రచారాలు చేసేవారికి కర్రు కాల్చి వాతపెట్టాలని వ్యాఖ్యానించారు. దీనికి జైపాల్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఘాటుగా ప్రతిస్పందించారు. 2011 సంవత్సరం నవంబర్ 29వ తేదీన నిరాహారదీక్షకు కూర్చున్న కేసీఆర్, రెండోరోజుకే సన్నిహితుల సమక్షంలో నిమ్మరసం తాగి దీక్ష ఎందుకు విరమించారో ఇప్పటికీ వివరణ ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ నాడు దీక్ష విరమిస్తున్న వీడియోను మీడియాముందు ప్రదర్శించారు. ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు, ప్రజా సంఘాలు ఒత్తిడి చేయటంతో మళ్ళీ నిరాహార దీక్షను నిమ్స్‌లో కొనసాగించారని చెప్పారు. ఆ దీక్ష డ్రామా ఎలా సాగిందీ అందరికీ తెలుసని, దాని గుట్టును మరొకసారి బయటపెడతానని అన్నారు. ఇవన్నీ తమకు అప్పుడే తెలిసినా కేసీఆర్ మర్యాద పోగొడితే తెలంగాణ ఉద్యమం పలచనవుతుందనే సదుద్దేశ్యంతో బయటపెట్టలేదని చెప్పారు. పెద్దవాడిగా చెబుతున్నానని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ నిగ్రహంతో ఉండాలని, మర్యాద పోగొట్టుకోగూడదని సూచించారు. వ్యక్తిగత విమర్శలు చేయకుండా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమని అడిగారు. కేంద్ర కేబినెట్లో నలుగురు సీమాంధ్ర మంత్రులు ఉంటే తానొక్కడినే ఉండికూడా ప్రత్యేక వాణిని బలంగా వినిపించానని చెప్పారు. తాను కేబినెట్ మంత్రిగా రాజీనామా చేస్తే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వచ్చేది కాదన్నారు.
పార్లమెంట్లో బిల్లు పెట్టిన 2014 ఫిబ్రవరి 18న కూడా మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా పడిందని, అందరూ బిల్లు పాస్ కాదనుకున్నారని జైపాల్ రెడ్డి చెప్పారు. ఆర్థికమంత్రి చిదంబరం బడ్జెట్ కాగితాలు పట్టుకుని సభకు వచ్చారని, అప్పుడు ఎంపీ పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కాళ్ళు పట్టుకుని బతిమలాడాడని తెలిపారు. సుష్మాకు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమలనాథ్కు సయోధ్య కుదరకపోతే తను కుదిర్చినట్లు చెప్పారు. ఆ రోజు బిల్లు పాస్ కాకపోతే నేటి తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. సోనియాగాంధి తెలంగాణ ఇవ్వకపోతే కుటుంబ సమేతంగా వెళ్ళి ఆమెను ఎందుకు కలిశావని ప్రశ్నించారు. అదేరోజు తనవద్దకు వచ్చి అందరిలో పెద్దవాడవు నువ్వు ముఖ్యమంత్రివి కావాలని కేసీఆర్ చెప్పాడని తెలిపారు. తాను దానికి బదులిస్తూ, పార్టీని కాంగ్రెస్‌లో కలపాలని, ఆయననే ముఖ్యమంత్రి కావాలని చెప్పినట్లు వెల్లడించారు. దానికి కేసీఆర్ నాడు సానుకూలంగా స్పందించినట్లు జైపాల్ రెడ్డి తెలిపారు.
పార్లమెంట్లో బిల్లుపెట్టినపుడు, దానికి ముందు – కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేటపుడు జైపాల్‌రెడ్డి చేసిన మంత్రాంగాన్ని ఎవరూ కాదనలేరు. ఆయనేకాదు, కాంగ్రెస్ ఎంపీలు మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేశవరావు, మందా జగన్నాథం తదితర 12మంది ఎంపీలు చేసినదేం తక్కువ కాదు. వీరు పార్లమెంట్ ఆవరణలో తెలంగాణకోసం అనేకసార్లు ఆందోళనలు చేసి అందరి దృష్టినీ ఆకట్టుకోవటమేకాకుండా, 2012 నవంబర్‌లో పార్లమెంట్లో – రీటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టే కీలక సమయంలో వీరి మద్దతు అవసరమైనప్పుడు సభకు హాజరు కాకుండా మెట్లపై కూర్చుని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధికే షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అటువంటి పరిస్థితిని ముందెన్నడూ ఎదుర్కొన్న దాఖలాలు లేవని అప్పట్లో చెప్పుకున్నారు. తెలంగాణపై సోనియానుంచి మాట తీసుకున్న తర్వాతే ఆ 12మందీ ఆ తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొని యూపీఏ ప్రభుత్వాన్ని పడకుండా నిలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పాత్రను, ఆ పార్టీ నాయకుల పాత్రను తీసిపారేయలేము.
అయితే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ సాధ్యమయ్యేదని ఎవ్వరూ చెప్పలేరు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిననాటినుంచి 13 ఏళ్ళపాటు ఉద్యమం సజీవంగా ఉండటంతో ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన ఎత్తుగడలు, చాణక్యం వలనే ఉద్యమం అన్నాళ్ళపాటు సజీవంగా ఉందనటంలో సందేహం లేదు. అయితే రాష్ట్ర సాధన ఘనతను పూర్తిగా ఆయనకు కట్టబెట్టలేమనే చెప్పాలి. ఆయనది ఖచ్చితంగా ఆ ఘనతలో మూడోవంతు ఉంటుంది. వాస్తవానికి 2009 సంవత్సరం వరకు పలు దఫాలు ఉపఎన్నికలకు పిలుపు ఇవ్వటం తప్పితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిందేమీలేదని చెప్పాలి. 2009 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు వచ్చి పలువురు నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొందరు నాయకులు తెలంగాణ భవన్‌కు వచ్చి మరీ కేసీఆర్‌ను దుర్భాషలాడివెళ్ళారు. వీటన్నింటినుంచి ప్రజలదృష్టి మళ్ళించటంకోసమే – కేసీఆర్ 2009 నవంబర్ 29న ‘హైదరాబాద్ ఫ్రీజోన్’ అంశంపై ఆమరణ నిరాహారదీక్షకు దిగారన్న వాదన ప్రచారంలో ఉంది. ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు, ప్రజాసంఘాల ఒత్తిడితో ఆ ఫ్రీజోన్ దీక్ష కాస్తా తెలంగాణ సాధన దీక్షగా మారటం, ఇక అప్పటినుంచి ఉద్యమం ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌తో దూసుకెళ్ళటం అందరికీ తెలుసు.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెలంగాణ జేఏసీ, దాని కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పాత్రను మళ్ళీ విశేషంగా చెప్పుకోవాలి. సకలజనులసమ్మె, మిలియన్ మార్చ్, అసెంబ్లీ ముట్టడి వంటి అనేక కార్యక్రమాలతో ఉద్యమాన్ని వీధులలోకి తీసుకొచ్చిన ఘనత కోదండరామ్‌దే. మధ్యలో కేసీఆర్‌తో విభేదాలు వచ్చినా తట్టుకుని నిలబడి రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకుంటూ తెలంగాణ జేఏసీ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు. జేఏసీ వలనే ఆ ఉద్యమం ఒక గాడిలో, సంఘటితంగా, సమీకృతంగా సాగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సాధనలో జేఏసీకి కూడా మూడోవంతు పాత్ర ఉందనటంలో సందేహంలేదు. మిగిలిన మూడోవంతు ఘనత ప్రజలు, మిగిలిన పార్టీలదని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
తెలంగాణ సాధన ఘనతను ఏ ఒక్క వ్యక్తికో, పార్టీకో ఒక్కనాటికీ ఆపాదించలేము. ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరామ్, జైపాల్ రెడ్డివంటివారు మాత్రమే కాకుండా గల్లీనుంచి ఢిల్లీదాకా అనేకమంది తమ తమ స్థాయిలలలో ఉద్యమంకోసం పాటుపడ్డారు. ప్రజలలో సెంటిమెంట్ బలంగా వేళ్ళూనుకుని ఉంది. అన్ని పరిస్థితులూ కలిసొచ్చాయి. ఎలాగైనా కలగనీ, సోనియాగాంధికి తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచన కలిగింది. వీరందరికంటే మిన్నగా ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలను తెలంగాణకోసం త్యాగంచేసి అమర వీరులయ్యారు. ఏ ఒక్కరో తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెబితే – అది వారి అజ్ఞానమో, డాంబికమో మాత్రమే అవుతుంది.