హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడితే – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును బంగాళాఖాతంలో పడేయాలని అంటుండటం ఆ రాష్ట్ర ప్రజలందరకూ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్నికూడా బంగాళాఖాతంలో పడేయమని పిలుపునిస్తున్నారు. వరంగల్ ఉపఎన్నిక సందర్భంగా తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ తరపున ప్రచారం చేసిన జగన్, ఇవాళ స్టేషన్ ఘనపూర్ రోడ్‌షోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. వరంగల్ ఉపఎన్నిక ఎందుకు తీసుకొచ్చారో కేసీఆర్‌ను ప్రజలు నిలదీయాలన్నారు. ఎన్నికలముందు ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 150మందిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతుల ఆత్మహత్యలకు కారణమెవరో నిలదీయాలన్నారు. 18 నెలల్లో ఎన్ని ఇళ్ళు కట్టించారో కేసీఆర్‌ను అడగాలని సూచించారు. దివంగత వైఎస్ఆర్ ఐదేళ్ళలో 48 లక్షల ఇళ్ళు కట్టించి ఇచ్చారని, కేసీఆర్ ఇప్పటివరకు 396 ఇళ్ళు మాత్రమే కట్టించారని చెప్పారు. ప్రతి దళితుడికీ 3 ఎకరాల భూమి ఇస్తానన్న ముఖ్యమంత్రి కేవలం 1600 ఎకరాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. తమ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌కు ఓటువేసి గెలిపించాలని కోరారు.