గత శుక్రవారం పారిస్ నగరంపై ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 129మంది ప్రజలు మరణించగా, మరో 180 మంది వరకు గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఫ్రాన్కోయీస్ హోలాండీ దేశంలో 12రోజుల పాటు ఎమర్జన్సీ విధించి, ఉగ్రవాదులు దేశంలో నుండి తప్పించుకొని పారిపోకుండా, కొత్తగా మళ్ళీ ఎవరూ లోపలకి జొరబడకుండా ఉండేందుకు ఫ్రాన్స్ దేశ సరిహద్దులను మూసివేయించారు. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. మొన్న పారిస్ నగర శివార్లలో గల సెయింట్ డెనిస్ అనే ప్రాంతంలో ఒక అపార్టుమెంటులో దాగి ఉన్న ఉగ్రవాదులలో ఇద్దరిని హతమార్చి మరో ముగ్గురిని సజీవంగా పట్టుకొన్నారు. వారిచ్చిన సమాచారం ప్రకారం పోలీసుల నుండి తప్పించుకొన్న అబ్దేస్లామ్ సలాహ్ అనే ఉగ్రవాది కోసం ఇంకా వెతుకుతున్నారు.
పారిస్ పై దాడులకు ప్రతీకారంగా ఫ్రాన్స్ వాయుసేనలు సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగిస్తోంది. వాటిపై స్పందించిన ఐసిస్ ఉగ్రవాదులు తాము కూడా మళ్ళీ ఫ్రాన్స్ దేశంపై దాడులు చేసి ప్రతీకారం తీర్చుకొంటామని ప్రకటించారు. ఈసారి ఐసిస్ ఉగ్రవాదులు జీవ రసాయన ఆయుధాలతో దాడులు చేసే ప్రమాదం ఉందని భావిస్తున్న ఫ్రాన్స్ ప్రభుత్వం, ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రస్తుతం విధించిన 12రోజుల స్టేట్ ఆఫ్ ఎమర్జన్సీని మరో మూడు నెలలపాటు పొడిగించాలని భావించి జాతీయ అసెంబ్లీలో అందుకోసం ఒక బిల్లును ఈరోజు ప్రవేశపెట్టింది. దానిపై చర్చించిన తరువాత అసెంబ్లీ దానికి ఆమోదముద్ర వేసింది. రేపు ఫ్రెంచ్ సెనేట్ లో కూడా ఆ బిల్లుపై చర్చ జరిగిన తరువాత ఆమోదిస్తారు. అది కేవలం లాంచనప్రాయమే కనుక రేపటి నుండి మూడు నెలల పాటు ఫ్రాన్స్ దేశంలో ఎమర్జన్సీ అమలులో ఉంటుంది.