దేశంలో అసహనం బాగా పెరిగిపోయిందనీ, మోదీ ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమంటూ దేశంలోని మేధావులు గగ్గోలుపెట్టారు. మతసామరస్యం దెబ్బతిన్నదనీ, సమభావం కరువైనదనీ, లౌకిక వాదానికి తీవ్రవిఘాతం కలిగిందంటూ, కేంద్రప్రభుత్వం గతంలో ఇచ్చిన అవార్డులను తిరిగిచ్చేయడానికి మేధావులు క్యూకట్టారు. ఉత్తరప్రదేశ్ దాద్రీ దగ్గర గోమాంసం గొడవపై దేశమంతటా నానారాద్ధాంతం జరిగింది. చివరకు హిందువులు పవిత్రంగా భావించే గోమాతను బజారుకీడ్చేదాకా ఈ నిరసనవాదులకు నిద్రపట్టలేదు. ఇదేదో లాభసాటి వ్యవహారంగా కనిపించడంతో సోనియాగాంధీ నిద్రలేచారు. నేరుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి, దేశం భ్రష్టుపట్టిందని చిత్రీకరించారు.
ఇక, మీడియా రోజులతరబడి గోవుమాంసం మీదనో, కాకుంటే అవార్డులను తిరిగిచ్చేస్తున్న మేధావులపైనో చర్చలుగట్రా ప్రసారంచేసింది. అప్పటివరకు ఆవుమాంసమంటే తెలియనివారు `నేను తింటానంటే, నేను తింటాను…’ అంటూ స్టేట్ మెంట్లు కుమ్మరించారు. ఇంట్లో కట్టలుగా పేరుకుపోయిన పాతపేపర్లను కూడా ఫ్రీగా ఇవ్వకుండా అమ్మేసుకునేవారుసైతం తమ అవార్డులను విసిరిపారేస్తామంటూ మీడియా ముందు శపథాలు చేయడం విడ్డూరం. మరికొంతమంది రోజూ బీఫ్ లేకుంటే ముద్దేదిగదన్నట్టుగా మీడియా ముందు ఫోజులిచ్చారు.
అసహనం పేరిట ఒకవైపున తీవ్రనిరసన ఎగిసిపడుతుండగానే మరో పక్క బిహార్ లో ఎన్నికలు పూర్తికావడం, నవంబర్ 8న ఫలితాలు రావడం జరిగిపోయాయి. బిహార్ ఫలితాల్లో మోదీ ప్రభంజనం కనబడలేదు. మహాకూటమి గద్దెనెక్కింది. దీంతో `అసహన’ పవనాలు తగ్గిపోయాయి. గత 12 రోజుల్లో మీడియాల్లో ఎక్కడా అసహనంపై తీవ్రస్థాయిలో చర్చలు జరిగినట్లు ఎవ్వరైనా గుర్తించారా? లేదే…. గతంలో గొంతుచిచ్చుకుని అరిచిన సోనియా- రాహుల్లుగానీ లేదా వామపక్షనేతలుగానీ అసహనంపై మాట్లాడటంలేదే…. ఇక మేధావులైతే సరేసరి. అవార్డులు ఇచ్చేస్తామంటూ ఇప్పుడు వారు ఊగిపోవడంలేదు. మీడియా కూడా ప్యాకేజీ డీల్ అయిపోయినట్లుగా ఈ సబ్జెక్ట్ ను పక్కనపెట్టేసింది. సామాన్యులు సైతం `అసహనం’ సంగతి మరచిపోయారు. దీనివల్ల మనకు ఓ విషయం అర్థమవుతోంది. దేశంలో ఏరకమైన భ్రాంతి (మాయ) కలిగించాలన్నా , రాజకీయ శక్తులు, మేధావులు, మీడియా తలచుకుంటే ఆ పని చిటికలో అయిపోతుందని తెలియడంలేదూ… ఈ మూడింటిలోనూ, మొదటిదైన రాజకీయశక్తి మహాబలోపేతమైంది. ఇది మిగతా రెండు శక్తులను (మేధావులు, మీడియాలను)చాలా నేర్పుగా వాడుకోగలదు. మొత్తంగా చూస్తే ఈ ముడు ఏక భావజాలంతో కలిస్తే ప్రజలకు నిద్రలేకుండా చేయగలరు. ఊర్లను ప్రశాంతంగా ఉండనీయరు. సెక్యులర్ మాటలు చెబుతూనే మతకలహాలకు ఆజ్యం పోస్తారు. చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన విషయాలను తవ్వితీస్తారు. అవే ప్రామాణికమంటారు. తమ వాక్ఛాతుర్యంతో ప్రజల మనసు విరిచేస్తారు. మొత్తానికి దేశంలో సహనమే లేనట్లు చిత్రీకరిస్తారు.
ఈ పన్నెండు రోజుల్లో ఏ మాయ జరిగింది? అసహన భారతం ఉన్నట్లుండి సహన భారతంగా ఎలా మారిపోయింది? బిహార్ ఎన్నికల ముందు లేనిది, ఎన్నికల ప్రచారంలో మహారక్కసిలా కనిపించి, ఎన్నికలు కాగానే కనుమరుగవడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి ? గొడ్డుమాంసం గొడవ ఎలా సర్దుమణిగింది? ఈ మీడియావాళ్లు అనేక సంఘటనలను ఊదరగొట్టి ఇప్పుడు అనంతర సంఘటనలను ఎందుకు పట్టించుకోవడంలేదు ? నిన్నమొన్నటిదాకా అత్యధిక ప్రాధాన్యతా అంశాలైన గొడ్డుమాంసం, అసహనం వంటివి అంతలో అప్రాధాన్యమైనవిగా ఎలా మారిపోయాయి? రాజకీయ శక్తులు, మేధావులు కలసికట్టుగా ఆడిన నాటకం అయిపోగానే మేకప్ కడిగేసుకున్నారు. అంతే, దేశమంతటా అసహనం తగ్గిపోయి సహన భారతం మళ్ళీ కనిపించసాగింది. దేశానికే గ్రహణం విడిచినట్లయింది. మేధావులు – మీడియా – రాజకీయ శక్తులు ఎవరిపాత్రను వారు అద్భుతంగా పోషించి 125కోట్ల మంది ప్రజలనెత్తిన `అసహనం’ ముసుగు తొడగడంలో సఫలీకృతులయ్యారు. మోదీని బద్నాం చేయాలనుకున్నారు. చేశారు. అక్కడితో కథ కంచికెళ్లింది. ఒక వేళ బిజెపీ గెలిచిఉంటే, ఈ గొడవ కంటిన్యూ అయిఉండేదేమో.
దేశంలో గొడ్డుమాంసం ఎవరు తింటున్నారో, గొడ్డుకారం ఎవరుతింటున్నారో ఎన్నడూ పట్టించుకోని వాళ్లు తమ చాతుర్యంతో దేశానికే అసహనమనే బూజు పట్టినట్లు భ్రాంతి కలిగించారు. బిహార్ ఫలితాలు రాగానే ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. నిజంగా అసహనం పేరుకుపోయిఉంటే మరి ఉద్యమాన్ని మధ్యలోనే ఎందుకు విడిచిపెట్టేసినట్లు ? పైన పేర్కొన్న మూడు వర్గాలవారే దీనికి సమధానం చెప్పాలి.
– కణ్వస