గత శుక్రవారం పారిస్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదుల దాడుల ప్రధాన సూత్రధారి అబ్దెల్ హమీద్ అబ్బావుద్ భద్రతా దళాల చేతిలో హతమయినట్లు పారిస్ ప్రాసిక్యూటర్ ఫ్రాంకోయీస్ మోలిన్ గురువారం నాడు దృవీకరించారు. మొన్న బుదవారం పారిస్ నగర శివార్లలో గల సెయింట్ డెన్నిస్ అనే ప్రాంతంలో ఒక అపార్టుమెంటులో నక్కి ఉన్న ఉగ్రవాదులపై ఫ్రాన్స్ భద్రతా దళాలు దాడి చేయగా, సుమారు ఏడు గంటలపాటు సాగిన హోరాహోరీ కాల్పులలో అబ్దెల్ హమీద్ అబ్బావుద్ కూడా మరణించాడు. ఒక మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చివేసుకోవడంతో అతను కూడా చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గదిలో బాంబుల ప్రేలుడు ధాటికి ఉగ్రవాదుల శవాలు ముక్కలు ముక్కలుగా తెగిపడి ఉండటంతో వారిలో అబ్దెల్ హమీద్ అబ్బావుద్ శవాన్ని గుర్తు పట్టడానికి డి.ఎన్.ఏ. పరీక్షలు నిర్వహించి, చనిపోయింది అతనేనని దృవీకరించుకొన్న తరువాత పారిస్ ప్రాసిక్యూటర్ ఈ విషయం ప్రకటించారు. అబ్దెల్ హమీద్ అబ్బావుద్ (27) బెల్జియంకి పౌరుడు. అతని గురించి ఫ్రాన్స్ దేశ పోలీసులు చాలా కాలంగా వెతుకుతున్నారు. ఒకసారి పోలీసుల దృష్టిలో పడినా అతనిని పోలీసులు గుర్తించలేకపోవడంతో తను తప్పించుకోగలిగాడు. ఆ రోజే అతనిని పోలీసులు పట్టుకొని ఉండి ఉంటే ఈ మారణఖండ జరిగేదే కాదేమో.