వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రధానంగా మాట్లాడిన విషయం ఏమిటంటే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయం కారణంగానే ఈ ఉప ఎన్నికలు ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దబడ్డాయని. వారి ఈ విమర్శకు తెరాస నేతలెవరూ కూడా జవాబు చెప్పుకోలేకపోయారు. కానీ ప్రతిపక్ష పార్టీలు చేసిన ఈ విమర్శ ప్రజలను ఆలోచింపజేసి ఉండవచ్చును. ఆ కారణంగా తెరాసకు ఎంతో కొంత నష్టం జరుగక మానదు. ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస ఓడిపోయినట్లయితే, దానికి అనేక ఇతర కారణాలతో పాటు ఇది కూడా ఒక ప్రధాన కారణమని భావించవచ్చును. అధికార ప్రతిపక్షాలు ఎమ్మెల్యేలు ఏదో ఒక అంశంపై విమర్శలు గుప్పించుకోవడం ఆ తరువాత రాజినామా చేసి మళ్ళీ ఎన్నికలలో పోటీకి సిద్దం అంటూ ఒకరిపై మరొకరు సవాళ్ళు విసురుకోవడం తరచూ చూస్తూనే ఉంటాము.
విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పుడు పాడేరు వైకాపా ఎమ్మెల్యే జి. ఈశ్వరి దానిని వ్యతిరేకిస్తూ తను రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేస్తానని, దమ్ముంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తనతో పోటీ చేయమని సవాలు విసిరారు. ప్రజాస్వామ్యాన్ని, తమను ఎన్నుకొన్న ఓటర్లను అపహాస్యం చేసే ఇటువంటి రాజకీయ నేతలందరూ వరంగల్ ఉప ఎన్నికలలో ప్రధానంగా ప్రస్తావించబడిన ఈ అంశాన్ని గమనించి, దీనినొక గుణపాఠంగా స్వీకరిస్తే మంచిది. రాజకీయ పార్టీలు, వాటి నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇకనయినా ఇటువంటి వికృత ఆలోచనలు, సవాళ్ళు చేయడం మానుకొంటే అందరికీ మంచిది.