హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు లెవల్లో డైలాగులు చెప్పారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారానికి ఆఖరి రోజైన నిన్న ఒక సభలో మాట్లాడుతూ, మహేష్ బాబు పోకిరి సినిమాలో చెప్పిన – ‘ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు’ అనే డైలాగును కోట్ చేశారు. ఎవరి ఓట్లతో మైండ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు అన్నారు. మీ ఓట్లతో వాళ్ళకు దిమ్మ తిరగాలంటూ ఓటర్లకు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే సత్తా చూపారో, అలాగే 21న జరిగే ఉపఎన్నికలోకూడా పోలింగ్‌కు తప్పనిసరిగా హాజరై సత్తా చూపాలని కోరారు. తన వెంట 14 ఏళ్ళు నడిచిన సైనికుడు, తెలంగాణ ఉద్యమంలో నిబద్ధతతో పనిచేసిన నాయకుడు అయిన దయాకర్‌కు కేసీఆర్‌కు పిలిచి టికెట్ ఇవ్వటమే కాకుండా రు.70 లక్షల చెక్కుకూడా చేతిలో పెట్టారని తెలిపారు. సామాన్యుడు పార్లమెంట్‌కు పోవాలంటూ దయాకర్‌ను పార్లమెంట్‌కు పంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
బీజేపీ అభ్యర్థి దేవయ్యను గురించి మాట్లాడుతూ, ఆయనకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని, బీజేపీలో సభ్యత్వంలేదని, వరంగల్‌లో ఎవరూ లేనట్లు ఎక్కడనుంచో తీసుకొచ్చి పెట్టారని, వరంగల్ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణది హైదరాబాద్ అని, ఆయనను అక్కడే ప్రజలు తిప్పికొట్టారని, అటువంటి వ్యక్తి వరంగల్‌కు పనికొస్తాడా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో చెల్లని నోటు వరంగల్‌లో చెల్లుతుందా అన్నారు.