హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అఖండ విజయం సాధించిన మహాకూటమి ఇవాళ అధికారాన్ని చేపట్టింది. జేడీయూ నేత నితీష్‌కుమార్ ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పట్నా నగరంలోని గాంధీ మైదాన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ వ్యతిరేక పక్షాల నేతలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్‌తో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ, మాజీ ప్రధాని దేవగౌడ, కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ అజాద్, షీలా దీక్షిత్, అజిత్ జోగి, శంకర్ సింగ్ వఘేలా, కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, సీపీఎం అగ్రనేత సీతారాం యేచూరి, డీఎంకే నేత స్టాలిన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ ఇక ప్రధానమంత్రి పీఠం అధిష్ఠించటానికి ఢిల్లీకి బయలుదేరాలని వ్యాఖ్యానించారు..
ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ ఇద్దరూ నితీష్ వెంబడే ప్రమాణ స్వీకారం చేశారు. తేజస్వియాదవ్ ఉపముఖ్యమంత్రిగానూ, తేజ్ ప్రతాప్ క్యాబినెట్ మంత్రిగానూ వ్యవహరించనున్నారు. మంత్రివర్గంలో 12 మంది జేడీయూ, 12మంది ఆర్జేడీ, నలుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నితీష్ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.