హైదరాబాద్: బ్రహ్మానందం కామెడీ రొటీన్ అయిపోయిందని ఇటీవల వెల్లువెత్తిన విమర్శలపై ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు. ఒక ఆంగ్ల దినపత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దర్శకులు, రచయితలు చెప్పినదానినే తాను అనుసరిస్తానని చెప్పారు. ఈ పాత్ర రొటీన్‌గా ఉందనో, తన పాత చిత్రాన్ని పోలి ఉందనో వారితో తాను వాదించలేనని అన్నారు. చిత్ర నిర్మాణంలో ఎంతో డబ్బు ముడిపడి ఉంటుందని, తనకు నచ్చినట్లుగా పాత్రను డిజైన్ చేయాలని తాను దర్శకుడినో, రచయితనో కోరలేనని చెప్పారు. డైరెక్టర్ విజన్ ప్రకారం నటించటమే తన పని అని అన్నారు. ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుందని, ఇప్పుడు హారర్-కామెడీ ట్రెండ్ నడుస్తోందని, తన పాత్రలను కూడా అలాగే ట్రెండ్‌నుబట్టి రచయితలు సృష్టిస్తారని వ్యాఖ్యానించారు.
తనపై వచ్చే విమర్శలను తాను తీవ్రంగా పరిగణించనని, తన పని తాను చేసుకుంటూ పోతానని చెప్పారు. కామెడీ చేయటం కష్టమైన పని అని, దానిని బాగా చేస్తే ఏ పాత్రనైనా చేయొచ్చని అన్నారు. జాతీయ ఫిల్మ్ అవార్డులలో బెస్ట్ కామెడీ యాక్టర్ అవార్డ్ లేకపోవటం తనకు బాధ కలిగిస్తుందని చెప్పారు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారన్న వార్తలపై వ్యాఖ్యానిస్తూ, డిమాండ్ ఉంది కాబట్టే తనకు ఎక్కువ ఇస్తున్నారని, కొన్ని సినిమాలు పారితోషికమేమీ తీసుకోకుండా చేశానని అన్నారు.
విదేశాలనుంచి వచ్చే తెలుగువారి పిల్లలు హైదరాబాద్ సందర్శించేటపుడు, చారిత్రక ప్రదేశాలు గోల్కొండ, చార్మినార్లతో పాటు తననూ చూడాలని కోరుకుంటూ ఉంటారని చెప్పారు. దీనిని తాను ఎంతో గర్వంగా, గౌరవంగా ఫీలవుతానని తెలిపారు. ప్రయాణాలలో చాలామంది తనను చూడగానే నవ్వుతారని, అయితే వారు ఎందుకు నవ్వుతారో తనకు తెలియదని, తనలో వారికి నవ్వొచ్చే అంశం ఏదో ఉందని మాత్రం తెలుసని అన్నారు. ప్రస్తుతం తాను బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్ని నాయన, ఆటాడుకుందాం రా, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, అబ్బాయితో అమ్మాయి, సౌఖ్యం, లోఫర్, చుట్టాలబ్బాయి, గరమ్, మెంటల్ పోలీస్, కృష్ణాష్టమి చిత్రాలను చేస్తున్నానంటూ ఒక పెద్ద జాబితాను చదివారు. ఈ చిత్రాలు తనకు వెంటనే గుర్తొచ్చినవి మాత్రమేనని, ఇవికాకుండా మరికొన్ని ఉన్నాయని చెప్పారు. తన పని అయిపోందనుకునేవారు ఈ జాబితా చూసిన తర్వాతయినా అర్థం చేసుకుంటారనుకుంటున్నట్లు తెలిపారు.
రిటైర్మెంట్ గురించి తానేమీ ఆలోచించలేదని బ్రహ్మానందం చెప్పారు. తాను అనుకోవటంవలన ఇది మొదలవలేదని, తాను అనుకోవటంవలన ముగియదంటూ తాత్మికంగా వ్యాఖ్యానించారు. భగవంతుడి దయవలన ఇన్నాళ్ళూ తాను ప్రజలను నవ్వించగలిగానని, నవ్వించగలిగినన్ని రోజులు నవ్విస్తానని చెప్పారు. విమర్శలను పట్టించుకోనని, తాను ఎల్లప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా జీవితాన్ని సాగిస్తానని, ఆందోళన పడనని అన్నారు.