పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశ రాజధాని బమాకో నగరంలో శుక్రవారం ఉదయం రెడిసన్ బ్లూ అనే స్టార్ హోటల్లో కొందరు ఉగ్రవాదులు మారణాయుధాలతో జొరబడి ఆ హోటల్లో ఉన్న సుమారు 170 మందిని తమ అధీనంలోకి తీసుకొన్నారు. వారిలో ఖురాన్ చదవగలిగిన ఏడుగురిని విడిచిపెట్టారు. బందీలుగా పట్టుకొన్న వారిలో కొంతమందిని ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు సమాచారం. హోటల్ కి వచ్చిన అతిధులతో బాటు, ఆ హోటల్లో పనిచేస్తున్న 40మంది ఉగ్రవాదులకు బందీలుగా చిక్కారు. వారిలో 20మంది భారతీయులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ దృవీకరించింది. వారందరూ దుబాయికి చెందిన ఒక ప్రముఖ సంస్థ తరపున ఆ హోటల్లో గత కొంత కాలంగా పనిచేస్తున్నారు.విదేశాంగ శాఖ అధికారులు మాలీ అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు హోటల్లో ఉన్న భారతీయుల క్షేమ సమాచారాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదుల చేతిలో చిక్కుకొన్న భారతీయులు అందరూ క్షేమంగానే ఉన్నట్లు తాజా సమాచారం.
ఆ హోటల్లోకి ఇద్దరు ఉగ్రవాదులే జొరబడినట్లు మొదట భావించినప్పటికీ, కనీసం 5-10 మంది ఉగ్రవాదులు లోపల ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పులలో ఒక ఉగ్రవాది మరణించగా ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం హోటల్ చుట్టూ భద్రతాదళాలు మొహరించి లోపలకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదులు హోటల్ యొక్క ఏడవ అంతస్తులో అన్ని వైపులా కలియ తిరుగుతూ భద్రతాదళాలు లోపలకి ప్రవేశించకుండా పైనుండి వారిపై హ్యాండ్ గ్రెండ్స్ విసురుతూ, తుపాకులతో కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోరాటం ఇంకా ఎప్పటికి ముగుస్తుందో దానిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో ఎవరికీ తెలియదు.