వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు రేపు (శనివారం) నిర్వహించడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వరంగల్ లోక్ సభ నియోజక వర్గంలో మొత్తం 15,09,671 ఓటర్లు ఉన్నారు. వారి కోసం మొత్తం 1,778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాంగ్రెస్, తెరాస, బీజేపీ, వామపక్షాలతో కలిపి మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో కాంగ్రెస్ తరపున సర్వే సత్యనారాయణ, తెరాస తరపున పసునూరి దయాకర్, బీజేపీ అభ్యర్ధిగా డా. దేవయ్య, వైకాపా తరపున నల్లా సూర్యప్రకాష్, వామపక్షాలు మద్దతు ఇస్తున్న గాలి వినోద్ కుమార్ ఈ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. ఈసారి ఈవిఎంలలో అభ్యర్ధుల పేర్లు, గుర్తుల పక్కనే వారి ఫోటోలు కూడా ఏర్పాటు చేసారు. రేపు ఉదయం సరిగ్గా ఏడు గంటలకు పోలింగ్ మొదలయ్యి సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. ఈ నెల 24వ తేదీన ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఉప ఎన్నికలను ఐదు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున ఎటువంటి ఆవంచనీయ ఘటనలు జరుగకుండా నివారించేందుకు మొత్తం 20 కంపెనీల పోలీసు బలగాలను మొహరించారు.