ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఐసిస్ ఉగ్రవాదులు దాడికి కుట్రపన్నారనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు ఒబామా మలేసియాలో జరిగే ఆసియాన్, తూర్పు ఆసియా దేశాల సదస్సులకు హాజరవుతున్నారు. మొత్తం 18 దేశాల నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఈనెల 26, 27 తేదీల్లో ఈ సదస్సులు జరుగుతాయి. ఇందుకోసం కౌలాలంపూర్లో ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి.
మలేసియా పోలీసుల రహస్య నివేదికను ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. దీని ప్రకారం, మోడీ, ఒబామా తదితర నేతల అంతానికి ఐసిస్ ఉగ్రవాదులు పక్కా స్కెచ్ వేశారు. ఇందుకోసం ఇప్పటికే 18 మంది సూసైడ్ బాంబర్లు మలేసియాలో మాటు వేసి ఉన్నారు. అందులో 10 మంది కౌలాలంపూర్లో, మరో 8 మంది మరో పట్టణంలో దాక్కున్నారు.
ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందనే సమాచారంతో మలేసియా ప్రభుత్వం అప్రమత్తమైంది. సదస్సు జరిగే వేదికల వద్ద భారీగా బలగాలను మోహరించారు. 4,500 మంది సైనికుల పహరాలో సమావేశాలు జరుగుతాయి. మరో 4,000 మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలో ఉంటారు. అలాగే, కౌలాలంపూర్లో అడుగడుగునా పోలీసు నిఘా ఏర్పాటు చేశారు.
పారిస్ దాడుల తర్వాత ఐసిస్ దాడుల జోరు పెంచాలనే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా, ముస్లింలు అధికంగా ఉన్న మలేసియాలో ఐసిస్ కుట్రను సఫలం చేయడానికి అనేక సానుకూలాంశాలు ఉంటాయని భావిస్తున్నారు. మలేసియాలో 61 శాతం ముస్లింలు నివసిస్తున్నారు. ఇది ఒక ఇస్లామిక్ దేశం. కాబట్టి, ఇక్కడ మోడీ, ఒబామాను టార్గెట్ చేయడానికి సీరియస్ గా ప్లాన్ చేసినట్టు మలేసియా పోలీసులు రహస్య నివేదిక వెల్లడించింది. ఈ దాడుల కోసం ఇటీవల మూడు ఉగ్రవాద సంస్థల నాయకులు ఫిలిప్పీన్స్ లోని సులులో గత ఆదివారం భేటీ అయ్యారని మలేసియా పోలీసులకు సమాచారం అందింది. ఐసిస్, అబూ సయ్యాఫ్, మోరో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 50 మంది నాయకులు మీటింగ్ పెట్టారు. కౌలాలంపూర్లో భారత్, అమెరికా తదితర దేశాల నేతలను టార్గెట్ చేయడం ఎలా, ఈ స్కెచ్ ను సక్సెస్ చేయడం ఎలా అనేదానిపై చర్చించినట్టు సమాచారం.
దీన్నిబట్టి, మోడీ, ఒబామాల భద్రతకు భారీగా బలగాలను మోహరించాలని మలేసియాతో పాటు భారత్, అమెరికా ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఒబామా భద్రతకు అమెరికా నుంచి స్పెషల్ కమెండో బలగాలు ఎలాగూ వస్తాయి. మోడీ రక్షణ కోసం బ్లాక్ క్యాట్ కమెండోల సెక్యూరిటీ కవరేజీ భారీగానే ఉంటుంది. అదనంగా సైన్యం, పోలీసుల పహరాలో ఈసారి ఆసియాన్ సదస్సు జరగబోతోంది. ఈనెల 27న సదస్సు ముగిసి, 18 దేశాల నాయకులు తిరుగు ప్రయాణం అయ్యే వరకూ మలేసియాలో ప్రతిక్షణం టెన్షన్ టెన్షనే.