మాలీ రాజధాని బమాకో లో రాడిసన్ బ్లూ హోటల్ పై అమెరికా, ఫ్రాన్స్, మాలి, ఐఖ్యరాజ్య సమితి భద్రతా దళాలు సంయుక్తంగా నిర్వహంచిన మిలటరీ ఆపరేషన్ నిన్న రాత్రి ముగిసింది. సంయుక్త దళాలు హోటల్లోకి ప్రవేశించి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చి బందీలందరినీ విడిపించాయి. ఉగ్రవాదుల చేతుల్లో మొత్తం 27మంది ప్రాణాలు కోల్పోయారు. వారి చెరలో చిక్కిన 20మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్ ఖైదా అనుబంధ తీవ్రవాద సంస్థ అల్ మౌరాబి టౌన్ ప్రకటించుకొంది.
ఉగ్రవాదులు స్థానిక కాలమాన ప్రకారం నిన్న ఉదయం 7గంటలకు రాడిసన్ బ్లూ హోటల్లోకి ప్రవేశించి మొత్తం 170 మందిని బందీలుగా పట్టుకొన్నారు. అదే హోటల్లో ఉంటున్న కొందరు కాల్పుల శబ్దాలు విని ప్రమాదం పసిగట్టి బయటకు పారిపోయి ప్రాణాలు రక్షించుకోగలిగారు. కేవలం ఇద్దరు ఉగ్రవాదులు మాత్రమే భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. కానీ వారు 10-12 మంది వరకు ఉంటారని బందీలు చెపుతున్నారు. మిగిలినవారి కోసం సంయుక్త దళాలు రాడిసన్ బ్లూ హోటల్లో ఇంకా వెతుకుతున్నాయి. మాలి దేశంలో తువారెగ్, అరబ్ అనే రెండు ఉగ్రవాద సంస్థలు చాలా కాలంగా తమ ఉనికిని చాటుకొంటున్నాయి. ఆగస్ట్ 2014లో మాలీలోని ‘సెవరె’ పట్టణంలో ఉగ్రవాదులు ఇదేవిధంగా ఒక హోటల్ పై దాడి చేసారు. ఆ దాడిలో నలుగురు తీవ్రవాదులు, నలుగురు సైనికులు, ఐదుగురు ఐరాస సిబ్బంది చనిపోయారు. ఆ తరువాత మార్చి 2015లో తీవ్రవాదులు బమాకో లో ఒక హోటల్ పై దాడులు చేసారు. అప్పుడు ఐదుగురు చనిపోయారు. ఈసారి రాడిసన్ బ్లూ హోటల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.